గిరులూ తరులూ.. భక్తజన సిరులు
అన్నవరం: కొండ ఎక్కి తన దర్శనానికి రాలేని భక్తులకు.. తన గిరులపై జన్మించిన వృక్షాలు, పక్షులు, జంతువులకు.. నిత్యం తనను అభిషేకించే పంపా నదికి.. తన దర్శన భాగ్యం కల్పించేందుకు.. ఆ సమస్త జీవుల పాపాలు తొలగించేందుకు.. సర్వజగద్రక్షకుడైన ఆ రత్నగిరి వాసుడే స్వయంగా కొండ దిగి వచ్చిన వేళ అన్నవరం పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమే అయ్యింది. భక్తవరదుడైన సత్యదేవుడు దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి పల్లకీపై, ప్రచార రథంపై కొలువుదీరి తమ చెంతకు చేరుకున్న వేళ భక్తులు పులకించిపోయారు. లక్షలాది భక్తజనం వెంట రాగా.. కార్తిక పౌర్ణమి పర్వదినమైన శుక్రవారం.. సత్యదేవుని గిరి ప్రదక్షిణ నభూతో.. అనే రీతిలో ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటలకు పల్లకీ మీద, మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథం మీద సాగిన ఈ గిరి ప్రదక్షిణలో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 2 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఉదయం పల్లకీ మీద జరిగిన గిరి ప్రదక్షిణలో తక్కువ మంది భక్తులు పాల్గొన్నప్పటికీ.. మధ్యాహ్నం ప్రచార రథంతో సాగిన ఈ ఉత్సవానికి భక్తులు ప్రవాహంలా పోటెత్తారు. రత్నగిరి, సత్యగిరి చుట్టూ సత్య రథంలో సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులతో సుమారు 4 గంటల పాటు సాగిన ఈ గిరి ప్రదక్షిణలో ఆద్యంతం భక్తితరంగాలు ఎగసిపడ్డాయి. భక్తులు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ అంటూ స్వామివారి నామం జపిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గం 11 కిలోమీటర్ల పొడవునా ఇసుక వేస్తే రాలని రీతిలో భక్తజన ప్రవాహం దర్శనమిచ్చింది. స్వామివారి ప్రచార రథానికి ఇరువైపులా చెరో మూడు కిలోమీటర్ల మే భక్తులు సత్యదేవుని నామం పలుకుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అశేషంగా భక్తులు తరలిరావడంతో అన్నవరం మెయిన్ రోడ్డుపై సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ప్రదక్షిణ సాగిందిలా..
గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వేలాదిగా మంది భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటకే రత్నగిరి దిగువన తొలి పావంచా వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ రత్నగిరి పై నుంచి తొలి పావంచా వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు చేసి, ప్రచార రథంపై వేంచేయించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్. ఈఓ కె.రామచంద్ర మోహన్‌లు కొబ్బరి కాయలు కొట్టి స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భజనలు, కోలాట నృత్యాలతో గిరి ప్రదక్షిణ ఆద్యంతం కోలాహలంగా సాగింది. మహిళల భక్తి గీతాల నడుమ సత్య రథంతో గిరి ప్రదక్షిణ సాగింది.
తొలి పావంచా నుంచి అన్నవరం మెయిన్ రోడ్డు మీదుగా బెండపూడి సమీపంలోని పుష్కర కాలువ వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు సత్య రథం చేరుకుంది. అక్కడ భక్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుష్కర కాలువ వెంబడి పంపా తీరం వరకూ గిరి ప్రదక్షిణ సాగింది. మధ్యలో మూడుచోట్ల స్వామి, అమ్మవార్లకు భక్తులు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రదేశాల్లో స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. గిరి ప్రదక్షిణ పంపా ఘాట్‌కు సాయంత్రం 5.30 గంటలకు చేరింది. ఆ సమయానికి కూడా భక్తులు తరలి వస్తూనే ఉండటం విశేషం. స్వామి, అమ్మవార్లకు పండితులు పంపా ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఊరేగింపుగా రత్నగిరికి చేర్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈఓతో పాటు వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం అవధాని, చిట్టి శివ ఘనపాఠి, సంతోష్ ఘనపాఠి, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తు శర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
స్వల్పంగా ఇబ్బందులు
ఫ గిరి ప్రదక్షిణ సాగిన పుష్కర రోడ్డు మీద భక్తుల పాదలకు రాళ్లు గుచ్చుకోకుండా గతంలో గడ్డి వేసేవారు. ఈ ఏడాది అలా చేయలేదు. చాలా మంది భక్తులు జోళ్లు లేకుండానే గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో చిన్న చిన్న గులకరాళ్లు పాదాలకు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డారు.
ఫ ఉదయం 8 గంటలకు స్వామివారి పల్లకీతో నడిచిన భక్తులకు మంచినీరు తప్ప ఫలాలు, ఫలహారాలు పంపిణీ చేయలేదు. గిరి ప్రదక్షిణ చివరిలో వ్రత పురోహిత సంఘం ఆధ్వర్యాన మాత్రమే మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ భక్తులకు మాత్రం 25 స్టాల్స్ ద్వారా అన్నీ పంపిణీ చేశారు. అయితే అంచనాకు మించి భక్తులకు రావడంతో అవి సరిపోలేదు.
ఫ ఘనంగా సత్యదేవుని గిరి ప్రదక్షిణ
ఫ పాల్గొన్న 2 లక్షలకు పైగా భక్తులు
ఫ ఉదయం పల్లకీతో.. మధ్యాహ్నం ప్రచార రథంతో నిర్వహణ
ఫ కోలాటాలు, భజనలతో మార్గమంతా కోలాహలం
ఫ హైవేపై గంటల తరబడి నిలిచిపోయిన ట్రాఫిక్
పోలీసులకు డబుల్ డ్యూటీ
గిరి ప్రదక్షిణ ఉదయం, మధ్యాహ్నం జరగడంతో పోలీసులు రెండుసార్లు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, మరో వంద మంది పోలీసులు, రోప్ పార్టీ సిబ్బంది రెండుసార్లు విధుల్లో పాల్గొన్నారు. రోప్ పార్టీ పోలీసులు మొత్తం 22 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment