ఏ ఉద్దేశంతో పార్టీ మారారు?
ఫ అధికార పార్టీలో ఉండాలన్నదే మీ ఉద్దేశమా?
ఫ లేక కేసుల భయంతో సరెండర్ అయ్యారా?
ఫ రాజీవ్‌కృష్ణకు జక్కంపూడి రాజా సూటి ప్రశ్న
కొవ్వూరు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా రాజీవ్‌కృష్ణకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పిస్తే.. ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ మారారో చెప్పాలని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. కొవ్వూరు లోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అధ్యక్షతన శుక్ర వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు వైఎస్సార్ సీపీలో చేరి, ఆఖరి క్షణం వరకూ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్‌కృష్ణ పార్టీ మారడం వలన కృష్ణబాబు ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. అధికార పార్టీలో ఉండాలనేదే మీ ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్–6 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, అయినప్పటికీ ఏ కారణంతో టీడీపీలో చేరారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్న భయంతో టీడీపీకి సరెండర్ అయ్యారేమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కోట్ల మంది హృదయాల్లో వైఎస్సార్ సీపీ చెరగని ముద్ర వేసుకుందన్నారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తకూ అండగా ఉంటామని రాజా భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడు తూ, తమ పార్టీ నుంచి గెలిచి, టీడీపీలో చేరడం అనైతికమని అన్నారు. పార్టీ మారిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ సహా ప్రతి ఒక్కరూ తమ నైతికతను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. రాజీవ్‌కృష్ణ పార్టీని వీడడం బాధాకరమన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు హామీలకు పవన్ కల్యాణ్, పురందేశ్వరే సాక్షులని, అబద్ధపు హామీలతో ప్రజలను ఏమార్చి కూటమి గెలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలకు చంద్రబాబు తెర లేపారన్నారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ ప్ర చారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఐదు నెలల కాలంలోనే రూ.59 వేల కోట్ల అప్పులు చేశారన్నారు.
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజీవ్‌కృష్ణ, ఇతర నాయకుల చేరిక సమయంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారని, వైఎస్సార్ సీపీలో ఉండి టీడీపీకి పని చేశారనే విషయాన్ని మంత్రి చెప్పకనే చెప్పారని విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీపై రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడతారన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ ఎవరు అధైర్యపడనవసరం లేదని అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీలు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసి, పార్టీ మారితే బాగుంటుందని అన్నారు. వైఎస్సార్ సీపీ ఖాళీ అంటూ కొన్ని పత్రికల్లో రాశారని, వెళ్లేవాళ్లు వెళ్తూంటారు, వచ్చేవాళ్లు వస్తూంటారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి బలమైన క్యాడర్ ఉందని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పోసిన శ్రీలేఖ, పార్టీ మండల అధ్యక్షులు సుంకర సత్యనారాయణ, చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, కాకర్ల వెంకటేశ్వరరావు, నాయకులు ఉప్పులూరి సూరిబాబు, కంఠమణి రమేష్, దేవగుప్తాపు లక్ష్మణరావు, గంధం శేషసాయి, నగళ్లపాటి శ్రీనివాస్, కవల నాగేశ్వరరావు, చిట్టూరి అన్నవరం, బోడపాటి హనుమంతరావు, కొయ్య దుర్గారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment