బిర్సా ముండా సేవలు చిరస్మరణీయం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దేశ స్వాతంత్య్రం కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు కొనియాడారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం బిర్సా ముండా జయంత్యుత్సవం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ చిన్నరాముడు, డీఆర్వో టి.సీతారామమూర్తి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జార్ఖండ్‌లోని కుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 నవంబర్ 15న బిర్సా ముండా జన్మించారన్నారు. 1894 అక్టోబర్ 1న ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారని, పేదల పక్షాన నిలబడి పలు పోరాటాలు చేశారన్నారు. 1900 ఫిబ్రవరి 3న ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయగా, అదే ఏడాది జూన్ 9న తుది శ్వాస విడిచారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన సేవలకు గాను రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా పేరు పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కేఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవికి రూ 1.40 లక్షల బంగారం సమర్పణ
ఆత్రేయపురం: మండల కేంద్రం ఆత్రేయపురం లొల్ల లాకుల వద్ద వేంచేసియున్న దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు రెండు కాసుల బంగారం తాడును సమర్పించినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మండల పరిధిలోని నార్కెడ్‌మల్లి గ్రామానికి చెందిన గుబ్బల ఫణికుమార్, మధుర మీనాక్ష్మి రూ 1.40 లక్షలు విలువ చేసే రెండు కాసుల బంగారం తాడును సమర్పించారన్నారు.
సత్యదేవుని సన్నిధానం.. భక్తజనసంద్రం
అన్నవరం: కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రత్నగిరి శుక్రవారం భక్తజన సంద్రమే అయ్యింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా జనసందోహంతో నిండిపోయింది. దేవస్థానం ఘాట్ రోడ్లు, మల్టీ లెవెల్ పార్కింగ్ స్థలాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు 10 వేలు జరిగాయి. కార్తిక మాసం ప్రారంభమైన తరువాత గత 15 రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడం, రికార్డు స్థాయిలో వ్రతాలు జరగడం ఇదే ప్రథమం. వీటిలోనూ రూ.300 టికెట్టు వ్రతాలే దాదాపు 7 వేలు జరిగాయి. రూ.వెయ్యి టికెట్టు వ్రతాలు 650, రూ.2 వేల టికెట్టుతో 800, రూ.1,500 టికెట్టుతో 550 వ్రతాలు నిర్వహించారు.
గురువారం రాత్రికే సుమారు 30 వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకున్నారు. స్వామివారి ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరిచి వ్రతాలు ప్రారంభించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి భక్తులను సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రద్దీ కొనసాగింది. స్వామివారి వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. వ్రతాల ద్వారానే దేవస్థానానికి సుమారు రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. మిగిలిన విభాగాల ద్వారా రూ.40 లక్షలు కలిపి మొత్తం రూ.కోటి ఆదాయం వచ్చింది. స్వామివారి అంతరాలయ దర్శనం టికెట్టు తీసుకున్న భక్తులను కూడా వెలుపల నుంచే దర్శనానికి అనుమతించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ఎదురుగా రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో, రావిచెట్టు వద్ద, ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో మెరిసిపోయింది. ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు. సుమారు 20 వేల మంది భక్తులకు పులిహోర, దద్ధోజనం, చిన్న పిల్లలకు పాలు ఉచితంగా పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment