ఫుల్ కిక్..!
శనివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2024
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతల నేతృత్వంలోని మద్యం మాఫియా నయా దందాకు తెర తీసింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలు వ్యవహారానికి తెగబడుతోంది. ఆన్‌లైన్ యాప్‌లలో బుక్ చేసుకుంటే కావాల్సిన వస్తువును నేరుగా ఇంటి వద్దకే అందించినట్లు.. ఒక్క ఫోన్ కొడితే చాలు.. నిమిషాల వ్యవధిలోనే కోరుకున్న బ్రాండ్ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. పండగలు, పుట్టిన రోజు, పెళ్లి రోజు తదితర ఫంక్షన్లకు ఎక్కువ మొత్తం ఆర్డర్లు వస్తున్నాయి. దీని కోసం గరిష్ట అమ్మకం ధర (ఎంఆర్‌పీ) కంటే ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ మద్యపాన ప్రియులు వెనుకాడటం లేదు. కాలు కదపకుండా గుమ్మం వద్దకే మందు వస్తోందని, ఈ ప్రక్రియ ఎంతో సౌలభ్యంగా ఉందని భావించి ఇంటికే సరకు తెప్పించుకుంటున్నారు మందుబాబులు. ధనార్జనే ధ్యేయంగా మద్యం షాపుల యజమానులు ఈ తంతుకు నాంది పలికితే.. అక్రమ సంపాదన కోసం కొందరు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల్లో సరుకు డెలివరీ చేస్తున్నారు. ఎలాంటి శ్రమా లేకుండా డబ్బు వస్తూండటంతో మద్యం డెలివరీ బాయ్స్ కూడా పెరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, చాగల్లు, నల్లజర్ల, ఉండ్రాజవరం, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, అనపర్తి తదితర మండలాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఎన్నడూ లేని ఈ విచిత్ర సంస్కృతికి కూటమి ప్రభుత్వం నాంది పలకడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మద్యపాన ప్రియులు తప్ప తాగి, పల్లెల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తారని, గొడవలకు ఆజ్యం పోసే పరిస్థితులు తలెత్తుతాయని మహిళలు ఆవేదన చెందుతున్నారు.
బెల్టు షాపులు కేంద్రంగా..
బెల్టు షాపులే కేంద్రంగా మద్యం అక్రమ విక్రయాల దందా నడుస్తోంది. సింహభాగం మద్యం షాపులను హస్తగతం చేసుకున్న కూటమి నేతల సిండికేట్ వీటికి అనుబంధంగా బెల్టు షాపులు తెరిచింది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టు షాపులు వెలిశాయి. అనధికారిక విక్రయాల కోసం ఏకంగా వేలం పాటలు నిర్వహించి మరీ ఎవరు ఎక్కడ విక్రయించాలో సిండికేటే నిర్ధారించింది. ఒక్కో బెల్టు షాపునకు ఆ ప్రాంతం, వ్యాపార స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ డిపాజిట్ వసూలు చేశారు. మద్యం దుకాణాలు లేని ప్రధాన కూడళ్లలో, మారుమూల గ్రామాల్లో బెల్టు షాపులు, డోర్ డెలివరీ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విక్రయించేస్తున్నారు. మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారే సరుకు ఇస్తూండటంతో బెల్టు షాపు నిర్వాహకులు తమకు ఇష్టమొచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా బహిరంగంగానే మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దుకాణాలు లేని శివారు ప్రాంతాలకు సైతం దుకాణ యజమానులు మద్యం సరఫరా చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
జిల్లా వ్యాప్తంగా అనధికారిక బెల్ట్ షాపులు, మద్యం డోర్ డెలివరీ, అక్రమ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైన్ షాపులు, బెల్టు షాపుల నుంచి మామూళ్లు ఫిక్స్ చేసుకున్నందువల్లనే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలున్నాయి. బెల్ట్ షాపుల వ్యవహారం ఇటీవల సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వైరల్‌గా కావడంతో తూతూమంత్రంగా దాడులు చేశారు. నాలుగు బాటిళ్లు పట్టుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు నుంచి బెల్టు దందా షరా మామూలుగా జరుగుతోంది. అక్రమ మద్యం విక్రయాలను, బెల్టు షాపులను అరికట్టేందుకు ఎకై ్సజ్ శాఖ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఉన్నా.. ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు లేవు. ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం కార్యాలయాలకే పరిమితమవుతున్నారు తప్ప.. క్షేత్ర స్థాయిలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫ ఫోన్ కొట్టు.. మద్యం పట్టు..!
ఫ మద్యం మాఫియా నయా దందా
ఫ వైన్, బెల్టు షాపుల నుంచి ఆర్డర్లపై డోర్ డెలివరీ
ఫ జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు
ఫ ప్రతి గ్రామంలో అనధికారికంగా తెరచిన కూటమి సిండికేట్
ఫ మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో అక్రమంగా విక్రయాలు
ఫ ఎమ్పార్పీకి మించి అమ్మకాలు
Comments
Please login to add a commentAdd a comment