యంత్రాల సాగు.. ఎంతో బాగు
● సమయం, ఖర్చు ఆదా
● ఎకరానికి రూ.5 వేల నుంచి
రూ.10 వేల మిగులు
పెరవలి: రబీ సాగుకి సమయం తక్కువగా ఉండటంతో రైతులు యంత్రాలతో విత్తనాలు చల్లటం, వరి నాట్లు వేయడం వల్ల అనుకున్న సమయానికి పంట చేతికి అందుతుందని వ్యవసాయాధికారి మేరీ కిరణ్ తెలిపారు. యంత్రాలతో సాగు చేయటం వల్ల పెట్టుబడులు తగ్గి లాభాలు పొందవచ్చన్నారు. ఇందుకోసం వరిసాగు చేయడానికి విత్తనాల దగ్గర నుంచి కోత కోసే వరకు యంత్రాలను వినియోగించుకుంటే లాభం రావడంతో పాటు వ్యయం తగ్గుతుందని వివరించారు. రైతులు వరికోత యంత్రాలనే వినియోగిస్తున్నారు తప్ప విత్తనాలు వేయడానికి, నాట్లు వేయడానికి మాత్రం యంత్రాలపై మక్కువ చూపడం లేదు. దీంతో వ్యయం పెరిగి ఆదాయం తగ్గుతోందన్నారు. యంత్రాలతో సాగు చేస్తే రైతుకి అన్ని విధాలా మేలని, అందుకోసం యంత్రాల ఉపయోగాలు, వాటి వల్ల రైతులకు కలిగే లాభాలను ఆమె వివరించారు.
డ్రమ్ సీడర్
డ్రమ్ సీడర్‌తో విత్తనాలు నాటుకుంటే కుదుర్లు ఎక్కు వ ఏర్పడి దిగుబడి పెరుగుతుందని, కూలీల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఎకరం చేనుకి 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. డ్రమ్ సీడర్‌తో విత్తనా లు వేసే రైతులు ట్రాక్టర్‌కు రోటోవీటర్‌ను అమర్చి దమ్ము చేసి నేలను చదును చేయాలి. నీరు కొద్దిగా ఉంచి కోర వచ్చిన విత్తనాలను డ్రమ్ముల్లో వేసి నాటాలి. డ్రమ్ సీడర్‌లో నాలుగు డ్రమ్‌లు ఉంటాయి. ఒక్కొక్క డ్రమ్‌లో ఒక కిలో చొప్పున విత్తనాలు వేస్తే 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడంతో విత్తనాలు పడతాయి. డ్రమ్ములకు అమర్చిన రంధ్రాల ద్వారా నాలుగు నుంచి ఏడు విత్తనాలు ఒకేచోట పడతాయి. డ్రమ్ సీడర్ లాగినప్పుడు లైనుకి లైనుకి మధ్య 22 సెంటీమీటర్ల వ్యత్యాసం ఉంటుందని చెప్పారు. చేలో నాట్లు సక్రమంగా రావాలంటే డ్రమ్ సీడర్ తాడును నిదానంగా లాగి, ఆ పక్కనుంచే డ్రమ్‌సీడర్‌ను తీసుకువెళ్తే వరుసలు సక్రమంగా ఉంటాయి. డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు చల్లడం వల్ల ఎకరానికి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయి. డ్రమ్ము సీడర్‌తో విత్తనాలు వేసిన చేలలో దుబ్బు బాగా చేసి వారం ముందే కోతలకు వస్తాయి. చీడపీడల సమస్య తక్కువగా ఉండి దిగుబడి 3 నుంచి 5 బస్తాలు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎకరానికి రూ.5వేలు ఖర్చు తగ్గుతుంది.
ఊడ్పు యంత్రం
ఊడ్పు యంత్రంతో వరినాట్లు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇందుకోసం ప్రత్యేక ట్రేలలో విత్తనాలను మడి కట్టుకోవాలి. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ట్రేలలో కట్టిన మడిలో 14 నుంచి 16 రోజుల్లో మొలకలు వస్తాయి. వీటిని నేరుగా ఊడ్పు యంత్రాలలో అమర్చితే నాట్లు అవే వేస్తాయి. ఊడ్పు యంత్రాల్లో రెండు రకాలు ఉన్నాయి. నడుస్తూ తీసుకువెళ్లే యంత్రం ఒకటి, నడుపుకునే యంత్రం ఒకటి. నడుస్తూ తీసుకువెళ్లే యంత్రం ద్వారా రోజుకి 3 నుంచి 4 ఎకరాల్లో నాట్లు వేయవచ్చు. నడుపుకునే యంత్రం ద్వారా 8 నుంచి 10 ఎకరాల్లో నాట్లు వేయవచ్చు. ఈ యంత్రాలు నాట్లు వేసేటప్పుడు 5 నుంచి 8 మొక్కలను ఒక కుదురుగా వేస్తాయి. మంచి దుబ్బు చేసి అధిక దిగుబడిని ఇస్తాయి. ఈ యంత్రం వల్ల కూలీల ఖర్చు తగ్గుతుందని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment