పీఈటీ కావడమే లక్ష్యం
● రిపబ్లిక్ డే పరేడ్‌కి ఎంపికై న
‘నన్నయ’ విద్యార్థి వెంకటరమణ
రాజానగరం: ‘ఆటలంటే చిన్నతనం నుంచి ఎంతో ఇష్టం. అయితే సరైన ప్రోత్సాహం లభించేది కాదు. ఎలాగైనా సరే వ్యాయామ ఉపాధ్యాయుడినై (పీఈటీ) ఆసక్తి ఉన్న విద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేయాలనుకున్నాను’ అంటున్నాడు రిపబ్లిక్ డే పరేడ్‌కి ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి ఎంపికై న ఎంపీఈడీ విద్యార్థి సుమ్మర్ల వెంకటరమణ. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ తన లక్ష్యాన్ని, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించాడు.
ఐదుగురి యువకులలో ఒకడు
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 26న జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌కి సంబంధించిన ప్రీ– ఆర్‌డీ క్యాంప్ మహారాష్ట్రలోని పూణే జరిగింది. రాష్ట్రం నుంచి 44 మంది యువతీ, యువకులు హాజరుకాగా, పరేడ్, కల్చరల్ పోటీలలో ప్రతిభ చూపిన 10 మంది (ఐదుగురు యువకులు, ఐదుగురు యువతులు) ఎంపికయ్యారు. ఆ ఐదుగురు యువకులలో ‘నన్నయ’ వర్సిటీ నుంచి వెంకటరమణ ఒకడు. నెలల వయసులోనే తండ్రి నాగరాజును పొగొట్టుకున్నాడు. తల్లి అప్పలకొండ కూలి పనులు చేస్తూ అన్నీ తానై ముగ్గురు పిల్లలను పెంచి, చదివించింది. అన్నయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా జాబ్ చేస్తున్నాడు, అక్కకు పెళ్లి చేశారు.
చిన్నతనం నుంచి స్పోర్ట్సు అంటే ఇష్టం
అడ్డతీగల మండలం, అరవైనాలుగు కొత్తూరుపాడుకు చెందిన ఈ విద్యార్థి రాజవొమ్మంగి మండలం, బొర్లగూడెంలో ఉన్నత పాఠశాల విద్య వరకు చదువుకుని, చోడవరంలోని ఏపీఆర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుకున్నాడు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో బీఏ చదువుకుని, ఏలూరు సమీపంలోని గోపన్నపాలెంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) చేశాడు. ప్రస్తుతం నన్నయలో ఎంపీఈడీ ఫైనలియర్ చదువుతున్నాడు. స్పోర్ట్సు అంటే చిన్నతనం నుంచి ఆసక్తి ఉంది. అయితే సరైన ప్రోత్సాహం లభించేది కాదు. ఆ సమయంలో అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ పోటీలు జరుగుతున్నాయని తెలిసినా వాటిలో పాల్గొనేవాడు. ఆ విధంగా ఉన్నత పాఠశాల స్థాయిలోనే 800 మీటర్లు, వెయ్యి మీటర్లు పరుగు పందెంలోను, కబడ్డీలోను, వాలీబాల్‌లోను బహుమతులతోపాటు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నాడు. రిపబ్లిక్ డే పరేడ్‌లోనూ ప్రతిభను కనబరచి, యూనివర్సిటీ పేరును ఢిల్లీలో వినిపించాలనే ఆకాంక్షను వెంకటరమణ వెలిబుచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment