నూతన ఉషస్సు కోసం..
ఫ కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం
ఫ అంబరాన్నంటిన సంబరాలు
ఫ కొంగొత్త ఆలోచనలతో ముందుకు సాగాలంటూ పరస్పర శుభాకాంక్షలు
ఫ సంక్షేమ వసంతం విరబూయాలని ఆశలు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా వ్యాప్తంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఇంట మరింత ఆనందం నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలు శుభాకాంక్షలు, పూజలు, ప్రార్థనలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు యువకులు, ప్రజలు, అధికారులు ఎక్కడికక్కడ రోడ్ల పైకి వచ్చి ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. కేక్‌లు కట్ చేశారు. యువత బీర్లు, కూల్ డ్రింకులు పొంగించి.. డీజేలు పెట్టుకుని స్టెప్పులతో ఉత్సాహంగా గడిపారు.
కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలంటూ పరస్పరం విషెస్ చెప్పుకొన్నారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల పరిసరాలు డీజేల శబ్దాలతో మార్మోగాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్టెప్పులేసి, అదరగొట్టారు. రాత్రి 12 గంటలు దాటగానే బాణసంచా కాల్చి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. ‘బైబె 2024.. వెల్‌కం 2025’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. అపార్ట్‌మెంట్లలో అందరూ కలిపి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు మంగళవారం పెద్ద ఎత్తున బొకేలు, స్వీట్లు కొనుగోలు చేశారు. దీంతో ఆయా షాపులు రద్దీగా మారాయి.
ఎన్నో ఆశలతో..
నూతన సంవత్సరంపై పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడు నెలలైనా వాటికి నేటికీ అతీగతీ లేదు. వాటి అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఫ తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున అందజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి అధినేతలు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఇది అమలుకు నోచుకోలేదు. కొత్త సంవత్సరంలోనైనా దీనిని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం హామీ అమలు పైనా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అధికార పగ్గాలు చేపట్టి నెలలు గడుస్తున్నా.. నేటికీ ఒక్క మహిళను కూడా ఉచితంగా బస్సు ఎక్కించిన పాపాన పోలేదు. ఈ ఏడాదైనా ఉచిత బస్సు ప్రయాణం దక్కుతుందా అని మహిళలు ఎదురు చూస్తున్నారు.
ఫ ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న ఆర్థిక సాయం కొత్త సంవత్సరంలోనైనా అందాలని కోరుకుంటున్నారు.
ఫ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల భృతి అంజేస్తామన్న కూటమి నేతల హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ హామీని ఈ సంవత్సరమైనా అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఫ పంట సాగు చేసే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్న కూటమి నేతల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఖరీఫ్ ముగిసి, రబీ సీజన్ ప్రారంభమైనా ఈ హామీ అమలుపై ప్రభుత్వం ఏ విషయమూ స్పష్టం చేయలేదు. ఫలితంగా సాగుకు రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఈ ఏడాదైనా పెట్టుబడి సాయం అందజేయాలని రైతులు ఆశ పడుతున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం
ప్రజలకు, పోలీసులకు మధ్య సామరస్య, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకువస్తాం. 2025లో నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. డ్రోన్, సీసీ కెమెరాల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌పై ప్రత్యేక నిఘా పెడతాం. నియంత్రణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతాం. మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా రక్షక్‌ను మరింత విస్తృతం చేస్తాం. పేకాట, కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా చర్యలు తీసుకుంటాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– డి.నరసింహ కిశోర్, జిల్లా ఎస్పీ
జిల్లా అభివృద్ధికి కృషి
సమన్వయంతో జిల్లా అభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. భారీ, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సా హం అందిస్తాం. కొవ్వూరు – పోలవరం నేషనల్ హై వే పనులను పట్టాలెక్కిస్తాం. కోళ్ల పెంపకంపై ఫోకస్ పెడతాం. స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధికి బాటలు వేస్తాం. పర్యాటక రంగానికి ప్రాధాన్యం కల్పిస్తాం. కడియం నర్సరీలకు పర్యాటకంగా మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. పాఠశాలల్లో మౌలిక వసతులు బాగున్నాయి. విద్యా ప్రమాణాలపై ఫోకస్ పెట్టి ఉత్తీర్ణత, అక్షరాస్యత శాతం పెంచుతాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తాగునీరు, మరుగుదొడ్లు, గోడలపై అందమైన చిత్రాలు ఉండేలా చూస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రజలు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment