అప్పుల్లో ఏపీని అగ్రగామి చేయడం బాబు టార్గెట్‌: చెల్లుబోయిన | YSRCP Chelluboina Venu Satirical Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

అప్పుల్లో ఏపీని అగ్రగామి చేయడం బాబు టార్గెట్‌: చెల్లుబోయిన

Published Fri, Jan 3 2025 1:57 PM | Last Updated on Fri, Jan 3 2025 3:41 PM

YSRCP Chelluboina Venu Satirical Comments On CBN Govt
  • రాజకీయాల్లో చంద్రబాబు పచ్చి మోసగాడు
  • సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హమీల అమలు ఏదీ?
  • తాజా కేబినెట్ లోనూ వీటి ఊసే లేదు
  • ఈ ఏడాది 'తల్లికి వందనం'కు మంగళం
  • రాష్ట్రంలోని 87.42 లక్షల మంది విద్యార్ధులకు అన్యాయం
  • రూ.13.112 కోట్లు నష్టపోయిన విద్యార్ధులు
  • అన్నదాత సుఖీభవకు తిలోదకాలు
  • 54 లక్షల మంది రైతులకు సున్నం పెట్టిన కూటమి సర్కార్
  • 1.80 కోట్ల మంది మహిళల ఆడబిడ్డ నిధి జాడ ఏదీ?
  • రూ.260 కోట్లు మత్స్యకార భరోసాకూ ఎగనామం
  • ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ల ఊసేలేదు
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. భృతి అంతకంటే లేదు
  • హామీలపై ప్రశ్నించిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్
  • సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల  గొంతు నొక్కుతున్నారు
  • మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజం​

సాక్షి, రాజమహేంద్రవరం: దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించరు అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. 

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారీ ప్రజలను నట్టేట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన కేబినెట్ లో అయినా సూపర్ సిక్స్ అమలుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించినా, మళ్లీ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

మళ్ళీ, మళ్ళీ మోసం చేయడానికే..
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు చర్యలు తీసుకుంటాని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 12 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో సూపర్ సిక్స్ కు సంబంధించినవి లేవు. తాజాగా గురువారం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అయినా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. మళ్ళీ, మళ్ళీ మోసం చేయడమే అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రజలను నిరాశలోనే ముంచేశాడు.

హామీలు అమలు చేయలేక భయం అంటున్నారు
సూపర్ సిక్స్ తో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. మీ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చిన మీరు వారిని దారుణంగా మోసగించారు. చంద్రబాబు అనుభవం ప్రజలను మోసం చేయడానికే పనికి వస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలుపై అసెంబ్లీ సాక్షిగా వాటిని అమలు చేయాలంటే నాకు భయం వేస్తోందంటూ చంద్రబాబు చెప్పాడు. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి ఉన్న ఆదాయం ఎంత, బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఇచ్చే హామీలు సాధ్యమవుతాయా లేదా అనే విషయం ఇంత అనుభవం ఉన్నా చంద్రబాబుకు తెలియదా?

నవరత్నాలను ప్రకటించి చిత్తశుద్దితో అమలు చేశాం
ఆనాడు జగన్ గారు ప్రజల కోసం నవరత్నాలను ప్రకటించారు. దాని అమలుకు ఒక క్యాలెండర్ ను ప్రకటించి మరీ ప్రజలకు అందించారు. ప్రజలకు సాయం అందించడంలో ఆయన చిత్తశుద్దితో కృషి చేశారు. దానిపైన కూటమి పార్టీలు అసత్య ప్రచారాలు చేశాయి.  జగన్ గారి సంక్షేమం వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైందని, శ్రీలంకగా మారిందంటూ విమర్శించారు. జగన్ ప్రజల కోసం అప్పులు చేస్తే తప్పు అని అన్న చంద్రబాబు ఈ ఆరు నెలల్లోనే 1.19 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఒక్క రూపాయి కూడా తన హామీల మేరకు ఖర్చు చేయలేదు. 

ఇది ఒప్పు అని ఎలా సమర్థించుకుంటారో చంద్రబాబు చెప్పాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్ నెలలో విద్యార్ధులకు వసతిదీవెన, పొదుపుసంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకారభరోసా, జూన్ నెలలో అమ్మ ఒడి, జులై నెలలో విద్యా దీవెన, నేతన్న నేస్తం, సెప్టెంబర్ నెలలో చేయూత, అక్టోబర్ నెలలో రైతు భరోసా, నవంబర్ లో విద్యాదీవెన, రైతులకు సున్నావడ్డీ రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా అమలు చేశారు.

హామీల ఎగవేతకే జగన్  పాలనపై విమర్శలు
ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగవేయాలనే ధోరణితో జగన్ గారి పాలనపై విమర్శలు చేస్తూ, పాలనను గాలికి వదిలేశారు. నా అనుభవంతో సందపను సృష్టిస్తాను, సంక్షేమాన్ని సృష్టిస్తాను అని హామీలు గుప్పించాడు. నాడు జగన్ గారు అమ్మ ఒడి పథకాన్ని ప్రకటించి, విజయవంతంగా అమలు చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు దానిని కాపీ కొడుతూ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల కాలంలో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు ఎందుకు కలగలేదు? పైగా ఈ ఏడాది తల్లికి వందనంకు మంగళం పాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తాంటూ తాజా కేబినెట్ సమావేశంలో తీర్మానించడం ఖచ్చితంగా ప్రజలను మోసగించడమే.

వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులపైనా అబద్దాలు
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్షిగా గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 7.40 లక్షల కోట్లు అన్ని చెప్పారు. దీనిలో 2014-19 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులే రూ.4.50 లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కలన్నీ మీ మంత్రులే చెప్పారు. మోసమే మీ ఎజెండాగా పనిచేస్తున్నారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఘనుడు చంద్రబాబు
ప్రశ్నించాల్సిన సామాజిక మాధ్యమాలను సైతం ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. వ్యవస్థలన మేనేజ్ చేయడం అలావాటుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై వేర్వేరు పోలీస్ స్టేషన్ లలో పదుల సంఖ్యలో అబద్దపు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు.

కేబినెట్ లో హామీల అమలుపై చర్చ ఏదీ?
సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కార్ ఎగనామం పెడుతోంది. నిన్న కేబినెట్ లో మీరు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇదే నిజం అని అర్థమవుతోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ఏడాది అమలు చేయడం లేదనే అంశాన్ని మీ కేబినెట్ సమావేశం వల్ల తెట్టతెల్లమయ్యింది. సీఎం చంద్రబాబు ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదికే రూ. 13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. గత ఏడాది కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.10,000 సాయంను కూడా రైతులకు అందించలేదు. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ కోసం కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. వెయ్యి కోట్లు మాత్రమే. కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తామని అన్నారు. 1.80 కోట్ల మంది ఆడబిడ్డలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. ఇవ్వన్నీ మోసం కాదా?

అమ్మ ఒడి ఆగిపోయింది... తల్లికి వందనం మాయమయ్యింది
పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలు మార్చేశక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి తల్లి ఖాతాలో దాదాపుగా రూ. 26,000 కోట్లు జమ చేశారు. 73 వేల కోట్లతో నాడు-నేడు ద్వారా విద్యాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. తతల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తీరు గ్రామాల్లో తిరిగితే తెలుస్తుంది. 

ఎంతమంది స్కూలుకు వెళ్ళే పిల్లలు ఉంటే, ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమయ్యింది. రైతులు అప్పుల పాలు కాకూడదని పెట్టుబడి సాయంను అందించి జగన్ గారు దేశానికే ఆదర్శమయ్యారు. రైతుభరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రకటించింది. కానీ అమలు మాత్రం పట్టించుకోవడం లేదు. రైతుకు విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా జగన్ గారి ప్రభుత్వం అండగా నిలిచింది.

మహిళలను నిలువునా దగా చేశారు
రాష్ట్రంలో 19-59 సంవత్సరాల లోపు మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామనని హామీ ఇచ్చి, దారుణంగా మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.80 కోట్ల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ కేబినెట్ లో అయినా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. ఉచిత గ్యాస్ కింద ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని చెప్పి కేవలం ఒక సిలెండర్ తోనే మాయ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు అవసరం. కానీ ఈఏడాది బడ్జెట్ లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటదాయించింది.

మత్స్యకార భరోసా మాయం
గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థికసాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతున్నారు. అయితే పథకం అమలు పై ఖచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలను ఖరారు చేయలేదు.

బాబుగారి మాటలకు భావాలు వేరు
అన్ని వర్గాలను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసగించింది. చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. బాబుగారి మాటలకు భావాలే వేరు. ఆయన ఏదైనా చెప్పారంటే, ఖచ్చితంగా అది చేయరు అని అర్థం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా మరిచిపోయి మాట తప్పుతోంది. దీనిని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రజలపై దారుణంగా పెంచిన విద్యుత్ చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాం. రేపు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాడతాం. ప్రజల గొంతుకగా వైయస్ఆర్ సీపీ నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పాలకుల మీద ఉన్న నమ్మకం సడలిపోతే ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: చెల్లుబోయిన వేణు ఫైర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement