సిరుల చామంతి
సాగు ఇలా..
కొమ్మ కత్తిరింపు ద్వారా చామంతి మొక్కలను ప్రవర్ధనం చేస్తారు. పూల కోత పూర్తయిన తరువాత మొక్కల నుంచి పిలకలు కత్తిరించి నారుమడిలో నాటి కొత్త మొక్కలను సిద్ధం చేస్తారు. అంటుకు అంటుకు మధ్య మూడేసి అడుగుల దూరం ఉంచి నాటుకోవాలి. జూలై నెలలో నాటుకుంటే డిసెంబర్ నుంచి మంచి దిగుబడినిస్తాయి. చామంతి సాగుకు పెట్టుబడి తక్కువే అయినప్పటికీ.. ఈ మొక్కలను చిన్న పిల్లల్లా పెంచాలని రైతులు అంటారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పంట చేతికి దక్కదు. జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రూపాయికి రూపాయి వస్తుందని చెబుతున్నారు. వీటి సాగుకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ పెట్టుబడి అవుతుంది. ఒక్కో మొక్క 75 నుంచి 120 వరకూ పూలు పూస్తుంది. ఎకరం తోటలో 5 నుంచి 8 టన్నుల వరకూ పూల దిగుబడి వస్తుంది. అయితే, ఈ పంటకు చీడపీడల బాధ ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఫ లాభాలు పండిస్తున్న పూల సాగు
ఫ నిత్యం ఆదాయం
ఫ జిల్లాలో 3 వేల మందికి ఉపాధి
పెరవలి: నిశిరాత్రి బిగిసిందంటే చాలు.. ఎటు చూసినా.. దట్టంగా పరచుకునే మంచు పరదాలు.. గిలిగింతలు పెట్టే చలిగాలులు.. ఈ అపురూప అనుభవం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. ప్రస్తుత హేమంత రుతువులో.. గోదారి తీరాన ఉండే పల్లెల్లో.. ఇటువంటి ప్రకృతి సౌందర్యం మరింతగా కనువిందు చేస్తూంటుంది. అంతే కాదు.. ఈ శీతల వాతావరణం సొగసైన చామంతి పూలను కుప్పలుతెప్పలుగా విరబూయిస్తూ.. ప్రకృతికి మరింత అందాలను అద్దుతోంది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇప్పుడు ఎక్కడ చూసినా రంగురంగుల చామంతి పూలు నేత్రానందకరంగా దర్శనమిస్తున్నాయి.
ఎనలేని డిమాండ్
పూల సాగులో చామంతి పూలకు ఉన్న డిమాండ్ మరి దేనికీ ఉండదు. ఈ పూలు లేనిదే ఏ శుభకార్యక్రమం జరగదంటే అతిశయోక్తి కాదు. శ్రావణం నుంచి ఇంచుమించు చైత్ర మాసం వరకూ వచ్చే పండగలు, ఇళ్లల్లో జరిగే అన్ని శుభకార్యాల్లో చామంతి పూలది విశిష్ట స్థానం. అందుకే పండగల సమయంలో ఒక్కో చామంతి పువ్వు ధర రూ.3 పైగా కూడా పలుకుతూంటుంది. ఏడాది పొడవునా ఈ పూల సాగు జరుగుతున్నా.. సెప్టెంబర్ నుంచి మార్చి వరకూ మంచి నాణ్యమైన పూలు పూస్తాయి. ఆ సమయంలోనే పండగలు, శుభకార్యాలు జరుగుతూండటంతో వీటికి భారీ డిమాండ్ వచ్చి, మంచి ధర లభిస్తోంది. అందుకే జిల్లాలో అవకాశం ఉన్న రైతులు ఈ పూల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలోని పెరవలి, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ తదితర మండలాల్లోని సుమారు 180 హెక్టార్లలో చామంతి పూల సాగు జరుగుతోంది. పసుపు పచ్చ, ఎరుపు, తెలుపు, పింక్ వర్ణాలతో పాటు చిట్టి చామంతి పూలను కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
రూ.40 వేల వరకూ రాబడి
వాతావరణం అనుకూలించి, దిగుబడి బాగుండి, మార్కెట్‌లో మంచి ధర లభిస్తే రైతుకు లాభాలు పండినట్టే. ఒకవేళ మార్కెట్‌లో తగిన ధర లేకపోయినా నష్టాలు మాత్రం రావు. ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చే సమయంలో.. శ్రావణ మాసం ప్రారంభమైంది. అప్పట్నుంచి కిలో చామంతులకు దాదాపు రూ.300 పైనే లభిస్తోంది. సాధారణంగా సమయాన్ని బట్టి కిలో చామంతి పూలకు రూ.150 నుంచి రూ.350 వరకూ ధర పలుకుతుంది. ప్రస్తుతం శీతాకాలం పంట కావడంతో ఎకరం తోట నుంచి కోతకు 80 నుంచి 100 కిలోల వరకూ పూల దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. కిలో రూ.150 ధర లభించినా కోతకు సుమారు రూ.15 వేలు వస్తూండగా కూలీలు, ఎరువుల ఖర్చులు పోనూ రూ.3 వేల నుంచి రూ.4 వేలు మిగులుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారానికి రెండు కోతలు కోస్తున్నారు. ఐదు నెలల పంట కాలంలో అన్నీ సవ్యంగా ఉంటే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో కడియం మండలం కడియపులంక, పెరవలి మండలం కాకరపర్రు గ్రామాల్లో మాత్రమే పూల మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచే జిల్లా నలుమూలలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పూలు సరఫరా చేస్తారు. జిల్లాలో చామంతి సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. రైతులు, కూలీలు, వ్యాపారులు, పూలదండలు కట్టే మహిళలు, పురుషులు, చిరు వ్యాపారులకు పూల సాగుతో ఉపాధి లభిస్తోంది.
అంతా లాభమే..
చామంతి సాగుకు పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ. ఈ పంటను చాలా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే మొక్కలు అప్పటికప్పుడే చనిపోతాయి. తెగుళ్లు అధికంగా ఆశిస్తాయి. ఈ పంట వేస్తే అంతా లాభమే తప్ప నష్టం మాత్రం రాదు.
– నున్నం త్రిమూర్తులు, పూలరైతు, కాకరపర్రు, పెరవలి మండలం
ఆదాయం.. ఆనందం..
పూల సాగులో వస్తే భారీగా లాభం వస్తుంది లేదా పెట్టుబడి వస్తుంది. నష్టం మాత్రం రాదు. ఏటా ఏదో ఒక పూల సాగు చేస్తాను. పెట్టుబడి పోను ఎకరానికి సమయాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల ఆదాయం వస్తోంది. పూల సాగుతో ఆదాయం, ఆనందం లభిస్తున్నాయి.
– సంగీతం నారాయణ, పూలరైతు, కాకరపర్రు, పెరవలి మండలం
Comments
Please login to add a commentAdd a comment