రూ.52.46 కోట్లతో బీసీ కార్యాచరణ ప్రణాళిక
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యాన జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.52.46 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రణాళిక కింద వివిధ స్వయం ఉపాధి యూనిట్లు 1,879 ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమన్నారు.
మేదర, కుమ్మరి, శాలివాహన కుటుంబాల్లో ముగ్గురి నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన గ్రూపులకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. స్వయం ఉపాధి కార్యకలాపాల కింద 1,229 యూనిట్ల ఏర్పాటుకు మూడు స్లాబ్స్ కింద రూ.23.32 కోట్లు అందించనున్నామని వివరించారు. ఇందులో బ్యాంక్ రుణం 50 శాతం కాగా.. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ 50 శాతం ఉంటుందని తెలిపారు. అలాగే, ఒక్కో యూనిట్ రూ.5 లక్షల చొప్పున 449 మినీ డెయిరీల ఏర్పాటుకు రూ.22.46 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్కో యూనిట్ రూ.2 లక్షల చొప్పున 56 గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లను రూ.1.12 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందులో బ్యాంక్ రుణం 50 శాతం, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ 50 శాతం ఉంటాయని తెలిపారు. ఒక్కొక్కటి రూ.8 లక్షల చొప్పున రూ.1.92 కోట్లతో 24 జెనరిక్ మెడికల్ ఫార్మసీ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనిలో కూడా బ్యాంకు రుణం 50 శాతం, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ 50 శాతం ఉంటాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపిక
బిక్కవోలు: సీనియర్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు బిక్కవోలు గ్రామానికి చెందిన సత్రపు సుధీర్ కుమార్ ఎంపికయ్యాడు. స్థానిక వ్యాయామోపాధ్యాయుడు మానకొండ ధనరాజ్ మంగళవారం ఈ విషయం తెలిపారు. జనవరి 7 నుంచి 13 వరకూ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో మన రాష్ట్ర జట్టుకు సుధీర్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2017లో జాతీయ స్థాయి అండర్–17 విభాగం, 2018లో సబ్ జానియర్స్ విభాగం, 2019లో అండర్–19 విభాగంలో స్కూల్ గేమ్స్ పోటీల్లోను, 2020లో జానియర్స్ విభాగంలో, 2022లో రెండుసార్లు యూత్ నేషనల్స్‌లో సుధీర్ ఆడాడు. క్రమశిక్షణతో కూడిన శిక్షణ వల్లనే సుధీర్ ఈ స్థాయికి వచ్చాడని పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం, వాలీ బాల్ అసోసియేషన్ కార్యదర్శి యార్గగడ్డ బంగార్రాజు, అనపర్తి జోన్ వ్యాయమోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పడాల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి అన్నారు. సుధీర్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభినందించారు.
ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా
పెరవలి ఎంపిక
పెరవలి: జిల్లాలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా పెరవలి ఎంపికై ంది. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్ చేతుల మీదుగా కొవ్వూరు డీఎస్పీ దేవ కుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సంయుక్తంగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సిబ్బంది క్రమశిక్షణ, పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులకు సేవలు అందించటంతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రికార్డుల నిర్వహణ, క్రైం రేటు తగ్గడం, దొంగతనాలపై సకాలంలో చర్యలు చేపట్టి, రికవరీ చేయడంలో పెరవలి పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని వివరించారు. ఈ అంశాల ప్రాతిపదికన పెరవలిని జిల్లాలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేశామని చెప్పారు.
లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరరెడ్డి
రాయవరం: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా డీవీవీ నాగేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని నాగేశ్వరరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. జిల్లా కార్యవర్గం వివరాలను ఆయన వివరించారు. ఉపాధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం.అంబేడ్కర్, ట్రెజరర్‌గా పి.రమేష్, మహిళా కార్యదర్శిగా ఎస్.వి.నాగలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా కె.గణేశ్వరరావు, స్టేట్ కౌన్సిలర్‌గా ఎస్‌వీ ప్రసాద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment