![నరసాపురంలో ఓ జ్యూయలరీ షాపు
- Sakshi](/styles/webp/s3/article_images/2023/10/18/17nsp05f-290028_mr_1.jpg.webp?itok=ZVPJYUFQ)
నరసాపురంలో ఓ జ్యూయలరీ షాపు
నరసాపురం: ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో బంగారం ధరలు ఆకాశానికి చేరి కూర్చున్నాయి. రెండు నెలల క్రితం బంగారం ధరలు కాస్త తగ్గినా, మళ్లీ జోరు మీదున్నాయి. ఓవైపు షేర్ మార్కెట్ ఒడిదుడుకుల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్‌టైం హైలో కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.61 వేలు మార్కును చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే రూ.70 వేలను కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. నిలకడగా ఉన్న బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని కొన్ని నెలలుగా బులియన్ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరో వైపు వెండి ధర కూడా పెరుగుతోంది. ప్రస్తుతం వెండి కిలో రూ.72 వేల వద్ద ట్రేడవుతోంది. ముంబై మార్కెట్ ధర ఆధారంగా నరసాపురం బులియన్ వ్యాపారం జరుగుతుంది. మంగళవారం నరసాపురం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61 వేలు, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు రూ.56,500లుగా ఉంది. 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ధర ప్రస్తుతం రూ.45,200లకు చేరింది.
దుకాణాలు వెలవెల
దసరా, దీపావళి పండుగల రోజుల్లో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఇక క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కూడా సమీపంలో ఉండటం, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవడంతో బంగారం ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపింది. దీంతో మొన్నటివరకు కళకళలాడిన జ్యూయలరీ షాపులు ప్రస్తుత సీజన్‌లో కూడా వెలవెలబోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్‌లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.3 కోట్ల వరకు బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో జిల్లాలో రోజుకు రూ.2 కోట్ల వరకూ అమ్మకాలు తగ్గినట్టుగా అంచనా. దాదాపు 30 శాతం అమ్మకాలు తగ్గిపోయాయయని బులియన్ వర్తకులు చెబుతున్నారు.
పాత బంగారం మార్పిడిపై ఆసక్తి
బంగారం ధర భారీగా పెరగడంతో ఆభరణాల అమ్మకాలు పడిపోయాయి. పెళ్లిళ్ల వంటి సామాజిక అవసరాలకు బంగారం కొనేవారు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. పెట్టుబడిగా కొనే బిస్కెట్ అమ్మకాలు మాత్రం కాస్త బాగానే సాగుతున్నాయని చెబుతున్నారు. ఇక పాత బంగారం మార్పిడి జోష్ అన్ని పట్టణాల్లో కొనసాగుతోంది. ధర రూ.61 వేలకు చేరడంతో పాతబంగారం మార్పిడికి ఇదే అదునుగా కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాల్లో 50 శాతం వాటా పాత బంగారం మార్పిడితోనే జరుగుతోంది.
24 క్యారెట్లు 10 గ్రాములు రూ.61 వేలకు చేరిన ధర
కేజీ రూ.72 వేలు పలుకుతున్న వెండి
భారీగా తగ్గిన కొనుగోళ్లు..
ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
ధర ఇంకా పెరగొచ్చు
బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినా పెద్దగా తగ్గకపోవచ్చు. ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఎక్కువగా ఉంది. ఏదిఏమైనా బంగారం ధరలను అంచనా వేయలేకపోతున్నాం. ప్రస్తుతం 30 శాతం అమ్మకాలు తగ్గాయి. నగదుతో ఎవరూ బంగారం కొనుగోళ్లు చేయడంలేదు. పాత బంగారం మార్చుకుని కొత్త వస్తువులు ఆర్డర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే వ్యాపారం ఎక్కువగా సాగుతోంది.
– వినోద్‌కుమార్ జైన్, అధ్యక్షుడు, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్
![బంగారు ఆభరణాలు1](https://www.sakshi.com/gallery_images/2023/10/18/17nsp06f-290028_mr_0.jpg)
బంగారు ఆభరణాలు
![2](https://www.sakshi.com/gallery_images/2023/10/18/17nsp07f-290028_mr_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment