ఉత్సవ ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి
పోలవరం రూరల్: మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేసే ఏర్పాట్లు సంబంధిత శాఖ అధికారులు సకాలంలో పూర్తి చేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎంవీ రమణ ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లపై పట్టిసం శివక్షేత్రం వద్ద రెండవ దఫా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల విషయమై పలు శాఖలు సమస్యలను వివరించాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది పంచాయతీ నుంచి చేపట్టే చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు తదితర ఏర్పాట్లకు సంబంధించి రూ.28 లక్షల వరకు పాత బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో టెండర్‌దారులు ఎవరూ ముందుకు రాలేదన్నారు. దేవదాయశాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ విశ్వనాధరాజు మాట్లాడుతూ తాము వాటర్ సప్లయి, అదనంగా 100 మీటర్ల షామియానాలు ఏర్పాటు చేయగలమన్నారు. మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్ మంగారావు మాట్లాడుతూ గతేడాది గజ ఈతగాళ్లు, పడవలకు సంబంధించి రూ.3 లక్షలు బకాయిలు ఉండడంతో ఈ ఏడాది గజ ఈతగాళ్లు సుముఖత చూపడం లేదన్నారు. అనంతరం ఆర్డీవో రమణ మాట్లాడుతూ సమయం తక్కువగా ఉందని, ఖర్చు గురించి ఆలోచించకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. సమస్యలపై కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి.సాయిరాజు, ఎంపీడీవో కె.శ్రీనివాసరావు, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కె.వీరభద్రరావు, దేవస్థానం ఈవో చాగంటి సురేష్‌నాయుడు, ఆర్‌అండ్‌బీ డీఈ హరికృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రమేష్, ఏపీ ట్రాన్స్‌కో డీఈ గోపాలకృష్ణ, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టిసం ఉత్సవ కమిటీ చైర్మన్ ఎంవీ రమణ
Comments
Please login to add a commentAdd a comment