వాలీబాల్ జట్టుకు సచివాలయ ఉద్యోగి ఎంపిక
నూజివీడు: పట్టణానికి చెందిన బండారు శరత్‌కుమార్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు. ఈయన ఆగిరిపల్లి మండలం కృష్ణవరం సచివాలయంలో గ్రేడ్–6 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ వాలీబాల్ జట్టుకు వరుసగా మూడోసారి ఎంపిక కావడం గమనార్హం.
చెప్పుల బాక్స్‌లో తాచుపాము
జంగారెడ్డిగూడెం: చెప్పుల బాక్సులో గోధుమ తాచు కొద్దిసేపు కలకలం రేపింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ గుడి వెనుక జగదీష్ తన ఇంట్లో చెప్పులు వేసుకునేందుకు చెప్పుల బాక్సును తెరవబోగా, పాము ఉండటం గమనించి స్నేక్ సేవియర్స్ సొసైటీ సంస్థ అధ్యక్షులు చదలవాడ క్రాంతికి సమాచారం ఇచ్చారు. క్రాంతి చాకచక్యంగా పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఎవరికి ఎలాంటి అపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు
ద్వారకాతిరుమల: పిచ్చి కుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ద్వారకాతిరుమలలోని తూర్పు వీధిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పల కిరణ్ ఇంటికి వెళ్లేసరికి అక్కడున్న ఒక పిచ్చికుక్క అమాంతం అతడిపై దాడి చేసింది. ఈ దాడిలో అతడి కాలుకి బలమైన గాయమైంది. అదే ప్రాంతానికి చెందిన 6 ఏళ్ల బాలుడు ఎస్.జస్వంత్ ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో పిచ్చికుక్క దాడి చేసి కరిచింది. స్థానికులు స్థానిక పీహెచ్‌సీకి తరలించి రేబీస్ వ్యాక్సిన్ వేయించారు. పిచ్చికుక్కను చంపేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అది దొరకలేదు.
అగ్ని ప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం
ఏలూరు టౌన్: ఏలూరు వన్ టౌన్‌లోని ఓ గృహోపకరణాల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఏలూరు వన్‌టౌన్‌లోని బటర్ ఫ్లై హోమ్ నీడ్స్ షాప్‌లో ఆదివారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి రామకృష్ణ తమ సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment