సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
ఏలూరు టౌన్: జిల్లాలో పోలీస్ సిబ్బంది సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బందికి సంక్షేమ దివస్‌ను నిర్వహించారు. జిల్లాలోని పోలీస్, ఏఆర్, హోంగార్డుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. పలువురు ఎస్పీని కలిసి వారి సమస్యలు తెలియజేశారు.
ఐటీడీఏ పీఓ బాధ్యతల స్వీకరణ
బుట్టాయగూడెం: కేఆర్‌పురం ఐటీడీఏ పీఓగా కేతావత్ రాముల నాయక్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా సర్వశిక్షా అభియాన్ పీఓగా పనిచేస్తున్న రాముల నాయక్‌ను ఐటీడీఏ పీఓగా నియమిస్తూ ఈనెల 11న ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఇరిగేషన్ ఎస్‌ఈగా నాగార్జునరావు
ఏలూరు(మెట్రో): ఏలూరు సర్కిల్ ఇరిగేషన్ ఎస్‌ఈగా పి.నాగార్జునరావు నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖలో ఇచ్చిన పదోన్నతులు, బదిలీల్లో భాగంగా నాగార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. నాగార్జునరావు ప్రస్తుతం గోదావరి వెస్ట్రన్ డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో భీమవరం డ్రైనేజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఆరేళ్లు సేవలందించారు. రాష్ట్ర ఇరిగేషన్ ఎన్‌జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
22న జాబ్‌మేళా
ఏలూరు(మెట్రో)/ఏలూరు(టూటౌన్): ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాయలంలో ఈనెల 22న ఉదయం 9.30 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో శ్రీ సిటిలోని కాడ్బరీ మోండలేజ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని, టీమ్ మెంబర్ ట్రైనీ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఇంటర్/డిగ్రీ/డిప్లమో/ఐటీఐ పూర్తిచేసిన 18 నుంచి 22 ఏళ్లలోపు వారు అర్హులని, ఏడాదికి రూ.2.34 లక్షల జీతం ఇతర సౌకర్యాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 88868 82032లో సంప్రదించాలని కోరారు.
విద్యుత్ కండక్టర్ల మార్పునకు చర్యలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో భీమడోలు–పెదవేగి, భీమడోలు–ఏలూరు ఫీడర్‌లలో కండక్టర్ల మార్పునకు చర్యలు తీసుకున్నట్టు ఈపీడీసీఎల్ ఏలూరు డివిజన్ ఈఈ కేఎం అంబేడ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలు–పెదవేగి పనులు శనివారం నుంచి ఈనెల 31 వరకు, భీమడోలు–ఏలూరు పనులు వచ్చేనెల 1 నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. ఆ సమయంలో పెదవేగి, ఏలూరు విద్యుత్ కేంద్రాలకు కానుమోలు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేశామని, ఏదైనా లోపంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు సహకరించాలని కోరారు.
డీఎస్పీ జయసూర్య బదిలీ
భీమవరం: భీమవరం డీఎస్పీ ఆర్‌జే జయసూర్య బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్.మహేంద్రను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
భీమవరం: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అకౌంటెంట్ జనరల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్.బాలాజీ అన్నారు. భీమవరం సబ్ ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఆయన తనిఖీలు చేశారు. పెన్షన్ అసోసియేషన్ నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా బా లాజీ మాట్లాడుతూ అసోసియేషన్ నాయకులు సమైక్యంగా పెన్షనర్లకు సేవలందించడం అభినందనీయమన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, భీమవరం యూనిట్ ప్రధాన కార్యదర్శి పి.సీతారామరాజు, పి.సూర్యనారాయణ, కె.ముత్యాలరావు, కె.చంద్రరావు, ఆర్‌ఎస్ సూర్యనారాయణ, బి.సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment