విద్యుత్ కోతతో అన్నదాత గగ్గోలు
చాట్రాయి: వ్యవసాయం దండగ అనే భావనలో అన్నదాతల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను 9 గంటల నుంచి 8 గంటలకు కుదించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి 7 గంటలకు తగ్గించారు.
గురువారం 6 గంటలు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు.. శుక్రవారం 7 గంటల పాటు సరఫరా చేశారు. ఇలా రెండు గంటల పాటు కోత విధిస్తుండటంతో చేలకు పూర్తిస్థాయిలో సాగు నీరందకు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సగం పంటలకే నీరు
చాట్రాయి మండలంలో సుమారు 9,500 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 500 ఎకరాల్లో మిరప, 250 ఎకరాల్లో కూరగాయలు, 10 వేల ఎకరాల్లో రబీ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. విద్యుత్ కోతతో సగం పంటకే నీరందుతుందని రైతులు వాపోతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌తో వ్యవసాయాన్ని పండుగ చేశారని, దీంతో మెట్ట ప్రాంతంలోనూ రైతులు రెండు పంటలు పండించుకోగలిగారని అంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పగటి పూట 9 గంటల వరకు విద్యుత్ సరఫరా చేశారని గుర్తుచేస్తున్నారు. రెండు పంటలతో ఆదాయాన్ని గడించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, ఇప్పుడు విద్యుత్ సరఫరాలో కోతతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కారు వ్యవసాయానికి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించాలని కోరుతున్నారు.
వ్యవసాయ విద్యుత్ సరఫరా కుదింపు
2 గంటలు తగ్గించడంతో ఎండిపోతున్న పంటలు
ఆందోళనలో రైతులు
ఉన్నతాధికారుల ఆదేశాలతో తగ్గించాం
సౌర విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయానికి రెండు గంటల విద్యుత్ సరఫరాను తగ్గించాం. మరలా విద్యుత్ ఉత్పత్తి పెరిగిన తర్వాత 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తాం.
– సంజయ్, ట్రాన్‌స్కో ఏఈ, చాట్రాయి
కోతలు దారుణం
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ని రెండు గంటల కోత విధించడం దారుణం. దీంతో సగం పంటకే నీరు పెట్టుకోవాల్సి వస్తోందతి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 గంటలు విద్యుత్ సరఫరా చేశారు. అప్పుడు లేని కోతలు ఇప్పుడు ఎందుకు.
–మిద్దె చెన్నారావు, రైతు, కోటపాడు, చాట్రాయి మండలం
Comments
Please login to add a commentAdd a comment