మాంసప్రియులూ.. తస్మాత్ జాగ్రత్త
భీమవరం అర్బన్: పండుగలు, జాతరల సీజన్ కావడంతో మాంసం ప్రియులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పశు, వైద్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు తమ స్వలాభం కోసం శీతలీకరణ కేంద్రాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించి జేబులు నింపుకోవడంతో మాంసాహార ప్రియుల ఆరోగ్యంపై తీవ్ర చూపుతుందని పేర్కొంటున్నారు. భీమవరం మండలంతో పాటు పట్టణంలో సుమారు 400కు పైగా మాంసం దుకాణాల ద్వారా రోజువారీ విక్రయాలతో పాటు, శుభకార్యాలతో ఒక్కరోజులో సుమారు 20 టన్నులు పైగా కోడి, మేక, పశువుల మాంసం విక్రయిస్తున్నట్లు ప్రాథమిక అంచనా. పండుగలు, జాతరల సీజన్ రావడంతో కోళ్లు, మేకలు, గొర్రెలు పెంపకాలపై వ్యాపారులు దృష్టి సారించారు. గత డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు భారీ ఎత్తున వ్యాపారం జోరుగా సాగింది. రాత్రి వరకూ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ పకోడి వివిధ రకాల మాంస విక్రయాలు చేశారు.
శీతలీకరణలో ఎక్కువ రోజులు నిల్వలు
మాంసం దుకాణాల్లో చాలా వరకు వినియోగదారులకు అమ్మగా మిగిలిన మాంసాన్ని శీతలీకరణ కేంద్రాల్లో నిల్వ చేయడం పరిపాటిగా మారింది. అంతేకాకుండా నిల్వ ఉంచిన మాంసాన్ని వంటకాలలో వివిధ రకాల ప్లేవర్ మసాలాలతో హోటల్స్, రెస్టారెంట్లకు విక్రయిస్తుండగా ఫుడ్ సేప్టీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ వ్యాపారస్తులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు పలువురు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నిల్వ ఉన్న మాంసంపై బ్యాక్టీరియా, వైరస్‌లు వాప్తి చెందుతాయని వీటి కారణంగా మాంసంలో విష పదార్థాలు చేరి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పశు సంవర్థక శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. మాంసాహార ప్రియులు మాంసం వినియోగం, కొనుగోళ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
శీతలీకరణ కేంద్రాల్లో భారీగా నిల్వలు
పండుగల సీజన్ కావడంతో జోరుగా మాంసం విక్రయాలు
వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment