అధికారికి ఆక్వా రైతు బెదిరింపు
సాక్షి, భీమవరం: ఆక్వా రైతు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ డ్రెయినేజీ ఏఈ పోలీసులను ఆశ్రయించిన ఘటన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గం ఉండిలో బుధవారం చోటుచేసుకుంది. ఫిర్యాదు ఇచ్చేందుకు నాలుగున్నర గంటల పాటు అధికారులు స్టేషన్ వద్ద పడిగాపులు కాయగా ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం జరిగిన ఉండి మండల సర్వసభ్య సమావేశంలో ఉండిలోని బొండాడ డ్రెయిన్ గట్టును ఆక్రమించి గ్రామానికి చెందిన ఓ రైతు చెరువులు తవ్వుతుంటే ఏం చేస్తున్నారని పాములపర్రు ఎంపీటీసీ సభ్యుడు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యడవల్లి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ఉప్పులూరు ఎంపీటీసీ సభ్యుడు నిమ్మల కేశవకుమార్ (బాలు) డ్రెయినేజీ ఏఈ జయప్రకాష్‌ను నిలదీశారు. దీనిపై తనకు ఏ విషయం తెలీదని మత్స్యశాఖ అధికారులు అనుమతులిచ్చారని జయప్రకాష్ బదులిచ్చారు. దీంతో తప్పు మీదంటే మీదంటూ జయప్రకాష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రాంబాబు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చేటుచేసుకుంది. భూములు ఆక్వాజోన్ పరిధిలో ఉన్నందున నిబంధనల మేరకు అనుమతులిచ్చామని ఎఫ్‌డీఓ రాంబాబు చెప్పారు. స్థలాన్ని పరిశీలించి నిబంధనలు మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డ్రెయినేజీ ఏఈ జయప్రకాష్ సభ్యులకు తెలిపారు.
రక్షణ కల్పించాలని..
ఆక్వా రైతు సాగిరాజు సాంబశివరాజు తనను ఫోన్‌లో బెదిరించారని, అయన నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ డీఈ ఉగ్రనరసింహ అప్పన్నతో కలిసి ఏఈ జయప్రకాష్ బుధవారం ఉదయం 10 గంటలకు ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులు ఫిర్యాదు తీసుకునే వరకు అక్కడే వేచి ఉన్నారు. ఏఈ జయప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. అనంతరం ఏఈ జయప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఆక్వారైతు సాంబశివరాజు తనను ఫోన్‌లో బెదిరించాడని, చెప్పినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా డ్రెయిన్ గట్టును ఆక్రమించి తవ్వకాలు చేశారన్నారు. మంగళవారం తనకు ఫోన్ చేసి బెదిరించారని, ఆయన్నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించిన వైనం
డిప్యూటీ స్పీకర్ ఇలాకాలో ఘటన
కేసు నమోదుకు నాలుగున్నర గంటల పడిగాపులు
నా పొలాన్ని కలిపేసుకున్నారు
ఇదిలా ఉండగా సాంబశివరాజు ఆర్‌ఎస్ 311–2ఏ నంబర్‌లో గల తన 49 సెంట్ల పొలాన్ని ఆక్రమించి చెరువులు తవ్వుతున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు ఉండికి చెందిన దాట్ల శ్రీనివాసరాజు తెలిపారు. 13.52 ఎకరాల చెరువు తవ్వకాలకు అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా సుమారుగా 20 ఎకరాల తవ్వకాలు చేస్తున్నట్టు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment