భీమవరం: జిల్లాలోని గీత కార్మికులకు కులాల వారీగా కేటాయించిన మద్యం షాపుల దరఖాస్తులకు స్పందన కన్పించడం లేదు. దరఖాస్తుల గడువు ఈ నెల 8తో ముగియనుండగా శుక్రవారం వరకు సుమారు 113 దరఖాస్తులు మాత్రమే రావడం విశేషం. అక్టోబర్‌లో నిర్వహించిన మద్యం షాపులు దక్కించుకోడానికి పెద్ద సంఖ్యలో వ్యాపారులు పోటీపడగా ప్రస్తుతం గీత కార్మిక కులాలకు కేటాయించిన షాపులు దక్కించుకోడానికి ఆసక్తి చూపించడంలేదు. నూతన మద్యం విధానంలో అప్పట్లో జిల్లాకు 175 షాపులు కేటాయించగా ప్రభుత్వం వ్యాపారులకు 20 శాతం కమిషన్ ఇస్తామని ప్రకటించి షాపులు ప్రారంభించాక.. కమిషన్ ఇవ్వకుండా మోసం చేసింది. జనవరి 25న విడుదల చేసిన గెజిట్ నోఫికేషన్‌లో గీత కార్మిక కులాలకు 18 మద్యం షాపులు కేటాయించగా వాటిలో శెట్టిబలిజకు –10, గౌడకు –5, గౌడ్‌కు–2, శ్రీశైన–1 రిజర్వు చేశారు. గీత కార్మికులకు డిపాజిట్‌ను రూ. 2 లక్షలు, కిస్తీని రూ.32.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ షాపులను దక్కించుకోడానికి జిల్లా వ్యాప్తంగా 113 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment