![సిగ్న](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07jrgbut06-290039_mr-1738982400-0.jpg.webp?itok=IVFffVbl)
సిగ్నస్–25 వెబ్‌సైట్ ఆవిష్కరణ
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో ఈ ఏడాది నిర్వహించనున్న వార్షిక సాంస్కృతిక మహోత్సవం సిగ్నస్–25 వెబ్‌సైట్‌ను డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహోత్సవంలో దేశ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కళలు, నృత్యం, సాహిత్యం, నాటకాలు, సంగీతం వంటి రంగాల్లో విద్యార్థులు రాణించాలన్నారు. ఈ సాంస్కృతిక సంబరంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమలో ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు. ఏఓ బీ లక్ష్మణరావు మాట్లాడుతూ సిగ్నస్–25 అనేది వినోదానికి వేదిక కాదని, విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఒక్క చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలన్నారు. విద్యార్థులు సిగ్నస్–25 వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
బలివే శివరాత్రి ఏర్పాట్ల కోసం బహిరంగ వేలం
ముసునూరు: ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివేలో మహా శివరాత్రి సందర్భంగా పిభ్రవరి 24 నుంచి 28 వరకు జరుగనున్న మహోత్సవాల్లో షామియానా సామగ్రి సప్లయి కోసం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించగా, ఏలూరుకు చెందిన టి.మల్లేశ్వరరావు రూ.1,75,000 కు దక్కించుకున్నారు. తిరిగి ఫిబ్రవరి 10 తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ ప్రాంగణం వద్ద భోజన ఫలహారాల సప్లయి, క్యూలైన్ల కోసం ఐరన్ రాడ్ల సరఫరాకు టెండర్ కం వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. ఆసక్తి గలవారు ఫిబ్రవరి 8న ఉదయం వేలంలో పాల్గొనాలని చెప్పారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 1,468 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రాక్టికల్స్ రెండో రోజు పరీక్షకు 1,468 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు శుక్రవారం 13 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 1,745 మందికి 1,468 మంది హాజరు కాగా 272 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 1,011 మందికి 810 మంది హాజరు కాగా 201 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 729 మందికి 658 మంది హాజరు కాగా 71 మంది గైర్హాజరయ్యారు.
మన్యం బంద్ జయప్రదం చేయాలి
బుట్టాయగూడెం: ఈ నెల 12న జరిగే మన్యం బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కాకి మధు, కుంజా శ్రీను, జేఏసీ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు కోరారు. బుట్టాయగూడెంలో ఆదివాసీ కార్యాచరణ కమిటీ సమావేశం సోదెం ముక్కయ్య నివాసంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 భూ బదలాయింపు నిషేద చట్టాన్ని సవరణ చేయడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చెయ్యాలని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా 12న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చామన్నారు.
రక్తదానంతో ఎన్నో జీవితాలకు పునర్జన్మ
భీమవరం అర్బన్: రక్తదానం ఎందరో జీవితాలకు పునర్జన్మనిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ అన్నారు. భీమవరం మండలంలోని రాయలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెంటర్‌లో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఒకరిచ్చే రక్తదానం ముగ్గురి జీవితాలను కాపాడుతుందన్నారు. శుక్రవారం భీమవరంలోని రాయలం, తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 11న నరసాపురం, పాలకొల్లు, 13న తణుకు, 14న భీమవరంలోని రాయలంలో రెడ్‌క్రాస్ సొసైటీ సెంటర్లలో రక్త సేకరణ జరుగుతుందన్నారు.
![సిగ్నస్–25 వెబ్‌సైట్ ఆవిష్కరణ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07nzd06f-290080_mr-1738982400-1.jpg)
సిగ్నస్–25 వెబ్‌సైట్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment