పేదల భూమిలో ఆరకమణలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: భీమడోలు మండలం పోలసానిపల్లి జగనన్న కాలనీ రైతు భరోసా కేంద్రానికి ఎదురుగా పంపిణీ చేసిన వ్యవసాయ భూమిని అక్రమార్కులు రియల్ ఎస్టేట్‌గా మార్చేశారు. స్థల అమ్మకాల కోసం సిమెంట్ స్తంభాలు, ఐరన్ పైపులు దించారు. రెవెన్యూ అధికారులు స్పందించి పనులు నిలుపుదల చేశారు. వాస్తవానికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం గ్రామంలోని 8 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 4.05 సెంట్ల చొప్పున సర్వే నెం.251/3లో వ్యవసాయ భూమిని ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం అది చేతులు మారిపోయింది. రికార్డుల్లో సైతం ఆ భూమిపై గల వ్యక్తుల వివరాలు లేవు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ఉన్న నిబంధనలు పట్టించుకోలేదని, అక్కడ అసలు లబ్ధిదారులు లేరని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ఎంపీటీసీ, వైఎస్సార్‌సీపీ నేత అంబటి దేవి తహసీల్దార్‌కు గత నెలలో ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి స్పందన కనిపించలేదు. ఇదే సాకుతో అక్రమార్కులు సిమెంట్ స్తంభాలు, ఐరన్ పైపులను దించి పనులకు ఉపక్రమించారు. దీంతో ఎంపీటీసీ, గ్రామస్తుల సమాచారం మేరకు పోలసానిపల్లి వీఆర్వో సాల్మన్‌రాజు సంఘటన స్థలానికి చేరుకుని పనులు జరగకుండా నిలుపుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment