![తిరునాళ్లలో యథేచ్ఛగా వసూళ్ల పర్వం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07nzd03-290080_mr-1738982401-0.jpg.webp?itok=o_kHFBYz)
తిరునాళ్లలో యథేచ్ఛగా వసూళ్ల పర్వం
నూజివీడు: ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి రథసప్తమి ఉత్సవాలలో విరాళాల వసూళ్ల పర్వం యథేచ్చగా కొనసాగింది. దీనికి దేవాదాయశాఖ అధికారులు సైతం పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 4, 5వ తేదీల్లో రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా తిరునాళ్లు జరిగాయి. ఈ నెల 4న అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం కొందరు కమిటీగా ఏర్పడి రసీదులు లేకుండానే విరాళాలు వసూలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదానం రోజున దేవాలయం వద్ద హుండీల పేరుతో స్టీలు డబ్బాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు సంబంధించిన యూపీఐ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. అదే రోజు సాయంత్రానికి స్టీలు డబ్బాలు తీసుకెళ్లిపోవడంతో పాటు విరాళాల సొమ్మును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. నూజివీడు, గన్నవరం, విజయవాడ, మైలవరం, విస్సన్నపేట తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి రథసప్తమి ఉత్సవాల్లో పాల్గొని విరాళాలు ఇచ్చారు. దేవుడి కార్యక్రమానికి విరాళాలు ఇస్తుంటే రసీదులు ఇవ్వడానికి అభ్యంతరమేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దేవుడి కార్యక్రమాన్ని ఆరోపణలకు తావులేకుండా నిర్వర్తించాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
విరాళాల వివరాలు వెల్లడిస్తాం
ఆగిరిపల్లి: లక్ష్మీ నరసింహ స్వామి రథసప్తమికి అన్నదాన విరాళాల సేకరణ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నదాన కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment