![భారీగా ఎమ్మెల్సీ నామినేషన్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07elr101-290007_mr-1738982399-0.jpg.webp?itok=D3Keay5M)
భారీగా ఎమ్మెల్సీ నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే 18 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతవరకు 20 మంది అభ్యర్థులు 24 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుండటంతో కీలక అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ దాదాపుగా పూర్తయ్యింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు కీలక దశకు చేరుకుంది. గత నెల 29న గెజిట్ జారీ చేయగా ఈ నెల 3న ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 8, 9 తేదీల్లో సెలవు దినాలు కావడంతో సోమవారం ఒక్కరోజే నామినేషన్ల స్వీకరణకు తుది గడువు. శుక్రవారం మంచి ముహుర్తం కావడంతో ఉభయగోదావరి జిల్లాల నుంచి 18 సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వికి అందజేశారు. ఉభయగోదావరి జిల్లాల రిటర్నింగ్ అధికారిగా ఏలూరు కలెక్టర్ వ్యవహరిస్తుండటంతో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అంతా ఏలూరు కలెక్టరేట్‌లోనే నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు ఏలూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3న కౌంటింగ్ ప్రక్రియ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12, 22 తేదీల్లో మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. మొదటి దశ శిక్షణ పూర్తయిన వారికి 17న ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అందిస్తారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు.
440 పోలింగ్ కేంద్రాల్లో
3.15 లక్షల మంది ఓటర్లు
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 6 నూతన జిల్లాల్లో 440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3,15,261 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,83,734 మంది పురుషులు కాగా, 1,31,507 మంది సీ్త్రలు.. 20 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 62, పశ్చిమగోదావరి జిల్లాలో 93, తూర్పుగోదావరి జిల్లాలో 82, కాకినాడలో 96, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. 28న అన్ని జిల్లాల నుంచి ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు బ్యాలెట్ బాక్సులు తరలిస్తారు.
బరిలో 20 మంది అభ్యర్థులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు
ఇంతవరకూ 20 నామినేషన్ల దాఖలు
సోమవారం తుది గడువు
ఈ నెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న కౌంటింగ్
6 జిల్లాల పరిధిలో 440 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు
ఇంతవరకు అందిన 24 సెట్లను 20 మంది అభ్యర్థులు సమర్పించారు. ప్రధానంగా కూటమి పార్టీలు బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ బలపరిచిన దిట్ల వీరరాఘవులతో పాటు పేపకాయల రాజేంద్ర, ములగల శ్రీనివాసరావు, గుండుమోలు బాలాజీ, కాట్రు నాగబాబు, వానపల్లి శివ గంగ వీరగణేష్, బండారు రామ్మోహనరావు, నేతిపూడి సత్యనారాయణ, పచ్చిగోళ్ళ దుర్గారావు, బొమ్మిడి సన్నిరాజ్, మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జీవీ సుందర్, కుక్కల గోవిందరాజు, కాండ్రేగుల నర్సింహులు, గద్దె విజయలక్ష్మి, కట్టా వేణుగోపాలకృష్ణ, మాకే ప్రసాద్, చిక్కాల దుర్గారావు, తాళ్ళూరి రమేష్, చిక్కా భీమేశ్వరరావులు నామినేషన్లు సమర్పించారు. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment