![Andhra Pradesh Athlete Dandi Jyothika Special Interview With Sakshi](/styles/webp/s3/article_images/2022/06/7/Untitled-2_2.jpg.webp?itok=jV07RbhX)
కేరళ నుంచి ఒక పీటీ ఉష...
కర్ణాటక నుంచి ఒక అశ్వనీ నాచప్ప...
అస్సాం నుంచి ఒక హిమదాస్...
వారి అడుగు జాడల్లో మరో పరుగుల విజేత...
ఏపీ నుంచి దండి జ్యోతిక.
దేశంలో దండిగా పతకాలు సాధించింది.
ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద...
బంగారంలా మెరిసింది.
దండి జ్యోతిక శ్రీ పుట్టింది, పెరిగింది ఆంధ్రప్రదేశ్, పశి్చమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో. పదవ తరగతి వరకు ఆమె విద్యాభ్యాసం, క్రీడాకారిణిగా తొలినాటి సాధన కూడా తణుకులోనే. క్రీడాకారిణిగా ఎదగాలనే ఆకాంక్షను కొనసాగించిందామె. విజయవాడలో ఇంటర్ మీడియట్ చదువుతున్న రోజుల్లో రన్నింగ్ ప్రాక్టీస్ కొనసాగించింది. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న జ్యోతిక తాజాగా టర్కీలో జూన్ నాలుగో తేదీ జరిగిన సెవెన్త్ ఇంటర్నేషనల్ స్ప్రింట్ అండ్ రిలే కప్ నాలుగు వందల మీటర్లలో స్వర్ణం సాధించి, విజేతగా ఇండియాలో అడుగుపెట్టింది. నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్íÙప్‌లో పాల్గొనడానికి టర్కీ నుంచి నేరుగా చెన్నైకి చేరిన జ్యోతిక సాక్షితో మాట్లాడింది.
ట్రాక్ వదల్లేదు
జ్యోతిక తండ్రి శ్రీనివాసరావు బాడీ బిల్డర్. క్రీడాకారుడు కావాలనే ఆయన కల నెరవేరలేదు. తండ్రి కల నెరవేరకపోవడానికి ఆయనకు తల్లిదండ్రులకు క్రీడల విలువ తెలియకపోవడం, ప్రోత్సాహం లేకపోవడమే ప్రధాన కారణం అంటోంది జ్యోతిక. తనలో క్రీడాకారిణిని చూసుకుని తండ్రి సంతోషపడుతున్నారని, నాన్నకు గర్వకారణంగా నిలవగలగడం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పింది. ‘‘నేను సెవెన్త్ క్లాసు నుంచే ఆటల్లో చురుగ్గా ఉన్నాను.
కానీ పోటీలకు వెళ్లింది నైన్త్ క్లాస్ నుంచే. నాలో స్పోర్ట్స్ పర్సన్ ఉన్నట్లు మొదటిసారి గుర్తించింది కూడా మా నాన్నగారే. తణుకులో ఉన్నప్పుడు స్కూల్ పీఈటీ మాస్టారు సీతారామయ్య గారితోపాటు నాన్న కూడా శిక్షణ ఇచ్చారు. టోర్నమెంట్‌లకు వెళ్లేటప్పుడు ప్రతిసారీ నాకు తోడు వస్తారు. నాతోపాటు పాల్గొనే వాళ్ల వివరాలతోపాటు, వాళ్లు ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నారు, ఎంత సమయం ప్రాక్టీస్ చేస్తున్నారు వంటి వివరాలతోపాటు తనకు తెలిసిన మెళకువలు చెప్పి గైడ్ చేస్తుంటారు. బంధువులు, స్నేహితులు కలిసినప్పుడు ‘మీ నాన్నలాంటి నాన్న ఉండడం నీ అదృష్టం’ అంటుంటారు. వాళ్ల మాట నిజమే.
టీవీ లేదు.. సినిమా లేదు!
ఇంటర్‌లో ఉన్నప్పుడు సీనియర్ అథ్లెట్స్‌తో కలిసి ఒక ఇల్లు తీసుకుని ఉన్నాను. ఆ ఇంట్లో నో టీవీ. అందరమూ అథ్లెట్లమే కావడంతో ఎవరికీ టీవీ చూసే టైమ్ ఉండేది కాదు. కాలేజ్‌కి వెళ్లడం, రన్నింగ్ ప్రాక్టీస్ చేయడమే లైఫ్. క్లాసు పుస్తకాలు తప్ప ఇతర సాహిత్య రచనలు చదవడం కూడా కుదరదు. ఆశ్చర్యంగా ఉంటుందేమో కానీ, సినిమాలు చూసింది కూడా లేదు. ఖాళీ సమయంలో పెన్సిల్ డ్రాయింగ్ వేస్తుంటాను. కోచ్ వినాయక్ ప్రసాద్ మా అథ్లెట్లందరికీ శిక్షణనిచ్చేవారు. టోర్నమెంట్‌ల సమయంలో మా అమ్మ వచ్చి భోజనం వండి పెట్టేది. నేనేమీ కేలరీల లెక్క చూసుకుంటూ తినడం అనేది జరగనే లేదు. శక్తినిచ్చే పోషకాహారం తీసుకోవడం వరకే.
అభ్యంతరాలు తొలి మెడల్ వరకే
ఆడపిల్లకు ఈ పరుగులేంటనే మాట చాలామంది అమ్మాయిలకు ఎదురైనట్లుగానే నాకూ తప్పలేదు. ఒకసారి మెడల్ వచి్చన తరవాత ఇక ప్రశంసలే. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మెడల్స్ అందుకున్నాను. ఇన్నేళ్ల సాధన తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది. నేను 2016లో ఒకసారి టరీ్కకి వెళ్లాను. అది నా తొలి ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అయితే అప్పుడు ఫైనల్స్‌కి చేరలేకపోయాను. ఆ తరవాత ఏడాది ఏషియన్ యూత్ చాంపియన్íÙప్‌లో నాలుగో స్థానానికి పరిమితమయ్యాను. టర్కీ పోటీల్లో రెండవ ప్రయత్నంలో స్వర్ణం సాధ్యమైంది. హైదరాబాద్‌లో కోచ్ రమేశ్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను.
గత ఏడాది అక్టోబర్ నుంచి త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్‌లో తీసుకున్న శిక్షణతోపాటు టర్కీలో రష్యన్ కోచ్ గలీనా మేడమ్ శిక్షణ నా విజయానికి బాగా దోహదం చేశాయి. నెల రోజులు టర్కీలో ఉండి శిక్షణ తీసుకున్న తర్వాత పోటీలో పాల్గొన్నాను. ఇక నా భవిష్యత్తు లక్ష్యాల విషయానికి వస్తే... ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో విజయం సాధించాలి. ఆ తర్వాత ఒలింపిక్స్‌ని లక్ష్యంగా తీసుకుంటాను. తణుకులో ఉన్నప్పుడు నాలుగు వందల మీటర్ల లక్ష్యాన్ని చేరడానికి 58 నుంచి 59 సెకన్‌లు పట్టేది. విజయవాడ లో ప్రాక్టీస్ టైమ్‌కి 54 నిమిషాలకు చేరాను. ఇప్పుడు 53.05 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేశాను. 52 సెకన్లకు చేరడానికి ప్రాక్టీస్‌ని కంటిన్యూ చేస్తున్నాను’’ అంటూ ప్రాక్టీస్‌కి టైమవుతోందని ముగించింది. – వాకా మంజులారెడ్డి
టరీ్కకి వెళ్లడానికి ముందు గత ఏడాది అక్టోబర్ నుంచి త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్‌లో తీసుకున్న శిక్షణతోపాటు టర్కీలో రష్యన్ కోచ్ గలీనా మేడమ్ శిక్షణ బాగా దోహదం చేశాయి. నెల రోజులు టర్కీలో ఉండి శిక్షణ తీసుకున్న తర్వాత పోటీలో పాల్గొన్నాను. – జ్యోతికశ్రీ, అథ్లెట్
Comments
Please login to add a commentAdd a comment