అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా? | Doubt Is A Disease It Cant Heal Overcome And Treatment | Sakshi
Sakshi News home page

అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా?

Published Sun, Sep 17 2023 1:49 PM | Last Updated on Sun, Sep 17 2023 2:54 PM

Doubt Is A Disease It Cant Heal Overcome And Treatment - Sakshi

డాక్టర్‌ మాధవ్‌ యూనివర్సిటీలో మాథ్స్‌ ప్రొఫెసర్‌. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్‌ ఫోన్, మెయిల్స్, వాట్సప్‌ చాట్స్‌ ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్‌ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్‌ టాలెంట్‌పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్‌ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్‌ అందరూ మొబైల్‌ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్‌డీ అందుకున్నారు.

ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్‌ స్కాలర్స్‌తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్‌ పేపర్స్‌ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్‌ స్కాలర్స్‌నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్‌ తన కారు డ్రైవర్‌ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్‌ మాధవ్‌ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు.

కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్‌కు ఉన్న సమస్యను పారనాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి.

(చదవడం:

ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు.

ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్‌ యాంగ్జయిటీ, హైపర్‌ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్‌ డిజార్డర్‌ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి.

పారనాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ లక్షణాలు..

  • అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం
  • ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు.
  • స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు
  • ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు
  • వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు.
  • ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్‌షిప్‌ను సరిగా నెరపలేరు
  • ఏదైనా అంశంలో ఫెయిల్‌ అయినప్పుడు చాలా సెన్సెటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు
  • తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు
  • విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది
  • శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు
  • కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి
  • పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
  • పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది ∙ కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ లేదా డయలెక్టిక్‌ బిహేవియర్‌ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి సహాయపడతాయి
  • సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది
  • పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్‌ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది.

(చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్‌ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement