మధుమేహ వ్యాధిపై అవగాహన ర్యాలీ
గుంటూరు మెడికల్: శారీరక మార్పు కారణంగా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మధుమేహం వాయిదా వేయడం, నిరోధించటం చేయాలంటే ప్రతి ఒక్కరూ మంచి శారీరక శ్రమ కలిగి ఉండాలన్నారు. గురువారం గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్సరే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్‌న్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి లక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మీ, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డేగలప్రభాకర్, హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.హేమకుమారి హాజరయ్యారు. ర్యాలీ ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గుంటూరు ల్యాబ్ అండ్ ఎక్సరే ఓనర్స్ అసోసియేషన్ ప్రజల ఆరోగ్యం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఆనం సంజీవరెడ్డి చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. మధుమేహాన్ని గుర్తించలేకపోయిన, సరైన సమయంలో మంచి వైద్యం పొందకపోయినా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య శైలిని కలిగి ఉండటం ద్వారా డయాబెటిక్ కాంప్లికేషన్స్ నుంచి విముక్తి పొందవచ్చన్నారు. డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. డాక్టర్ ఎన్. హేమ కుమారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మధుమేహం వ్యాధిపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని మనం నిర్మించుకోవచ్చని చెప్పారు. ఆనం సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను మా సొంత నిధులతో సభ్యులందరం వెనుకాడకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా నిర్వహించి వ్యాధిగ్రస్తులకు వైద్య సూచనలు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తాడేకూరు శ్రీహరి, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం.వెంకటలక్ష్మణ్, కార్యదర్శి బి.శ్రీనివాస్, నేషనల్ ఎక్సరే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment