హెచ్చరించినా వినకపోవడంతోనే దేవరాజ్ హత్య
పొన్నూరు: మండలంలోని ములుకుదురు గ్రామంలో ఈ నెల 9వ తేదీన నక్కల దేవరాజ్ హత్యకు మహిళతో సన్నిహిత సంబంధమే కారణమని తెనాలి డీఎస్సీ జనార్ధనరావు తెలిపారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో హత్యకు కారణాలను డీఎస్పీ వెల్లడించారు. గ్రామానికి చెందిన దేవరాజ్ విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీసే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని మాధవ్, మణికంఠ, గౌతమ్‌ల ఇంటికి వెళ్లినప్పుడు మహిళల పట్ల దేవరాజ్ ప్రవర్తన బాగా లేకపోవడంతో అతనిని పలుసార్లు వారు హెచ్చరించారు. అయినా దేవరాజ్ తన ప్రవర్తన మార్చుకోకుండా మాధవ్ భార్య జ్యోతితో సన్నిహిత సంబంధం పెట్టుకుని చనువుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన మాధవ, స్నేహితుడు మణికంఠతో దేవరాజ్‌ను చంపాలని, అందుకు రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పాడు. మణికంఠ అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు (జోసఫ్, సాయి, రాజు)లకు డబ్బు ఆశచూపి దేవరాజ్‌ను తీవ్రంగా కొట్టి కాళ్లు, చేతులు విరిచేలా ఒప్పందం చేసుకున్నారు. పథకం ప్రకారం 9న రాత్రి దేవరాజ్ కళ్లలో కారం కొట్టి పొలాల్లోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. రాత్రి బయటికి వెళ్లిన భర్త ఇంటికి రాకపోవడంతో వెతుకుతున్న దేవరాజ్ భార్యకు పొలాల్లో దేవరాజ్ శవమై కనిపించాడు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ, హత్య కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ కిరణ్ బాబు పాల్గొన్నారు.
ములుకుదురు హత్య కేసును
చేధించిన రూరల్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment