విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
నరసరావుపేటటౌన్/నరసరావుపేట: విద్యుత్‌దాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద చెరువు ఏడో లైనుకు చెందిన ఇర్ల శంకర్(17) తెల్లవారుజామున టీ తాగేందుకు ఇంటి నుంచి బజారుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో రోడ్డుపై తెగి పడి ఉన్న విద్యుత్ తీగను పక్కకు తొలగించేందుకు పట్టుకున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హైమారావు, ఎస్‌ఐ హరిబాబు, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి విద్యుత్ తీగ తెగి పడటంతో దాన్ని పట్టుకొని ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రూ.పది లక్షలు చెల్లించాలి
విద్యుదాఘాతంతో మృతి ెందిన ఇర్ల శంకర్ కుటుంబానికి తక్షణమే రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని గురువారం నాయకులతో కలిసి ఆయన సందర్శించి ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తక్షణ పరిహారం అందించాలని కోరారు. విద్యుత్ శాఖ ఏఈ ప్రకటించిన రూ.5లక్షల నష్టపరిహారం సరిపోదని పేర్కొన్నారు. గోపిరెడ్డి వెంట గిరిజన కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు అచ్చి శివకోటి, వేముల శివ, షేక్ మాబు, తురక నాగుల్ మీరా, కోట చిన్నబాబు, అవార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment