పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి కార్మికుల వినతి
తాడేపల్లిరూరల్: బ్రహ్మానందపురం ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, నాయకులు గురువారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజన్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... 2014లో కోర్టు ఆదేశాల ప్రకారం యజమానులు దాదాపు రూ.42.93 కోట్లు కార్మికులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఆ మొత్తానికి 12 శాతం వడ్డీని కలిపి రెండు నెలల్లో ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీలో 333 మంది కార్మికులు ఉండగా, దాదాపు సగం మంది అనారోగ్యం, అర్ధాకలితో మృతి చెందారని తెలిపారు. ఒకప్పుడు ఎంతో ఘనంగా బతికిన కార్మికులు నేడు ఆర్థిక బాధలతో, కుటుంబ పోషణ కోసం తమకు నైపుణ్యం లేని పనులకు వెళ్తూ కడుపు నింపుకొంటున్నారని యువరాజన్‌కు వివరించారు. తగిన న్యాయం చేస్తానని యువరాజన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. ఏసీసీ పోరాట కమిటీ కన్వీనర్ కూరపాటి స్టీవెన్ మాట్లాడుతూ.. పీఎఫ్, పెన్షన్ తదితర కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లపై హెచ్‌ఎంటీ తరఫున ఎం.బాలాజీ సంతకాలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్పీ యాజమాన్యం ఆయనకు అధికారం ఇచ్చిందని తెలిపారు. యువరాజన్‌ను కలిసిన వారిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి. నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, కె. ఆదినారాయణ, బి.అంకయ్య, వై.సాంబయ్య, ఎం.ఆశీర్వాదం, వై.యహోషువా, బి. సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. కార్మికులు చేస్తున్న దీక్షలో షంషుద్దీన్, రామారావు, బి.నవనీతం, వి.లక్ష్మి, రమాదేవి, దుర్గాభవాని, రిబిక, సాంబశివరావు, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment