కోటి ఆశలతో వెళ్లి.. విగతజీవిగా మారి...
తెనాలి: కోటి ఆశలతో ఎంతో సంతోషంగా అమెరికాలో చదువు నిమిత్తం వెళ్లిన తెనాలి యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె భౌతికకాయం రావడంతో చూసిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి యువతి నాగశ్రీ వందన పరిమళ (26) మృతదేహం శుక్రవారం రాత్రి పొద్దుపోయాక స్వగృహానికి చేరుకుంది. టెనస్సీ స్టేట్‌లోని మెంఫిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన పరిమళ, ఈ నెల 16న జరిగిన స్నాతకోత్సవంలో పట్టా తీసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దీనికి మూడు రోజుల ముందు కారులో ప్రయాణిస్తుండగా ట్రక్ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకు అర్ధగంట ముందే తల్లిదండ్రులతో ఆమె ఫోనులో మాట్లాడారు. తెనాలి గాంధీనగర్‌కు చెందిన సూరె గణేష్, రమాదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెల్లో పరిమళ ఒకరు. ఎంఎస్ చేసేందుకు 2022లో అమెరికాకు వెళ్లారు. చదువు పూర్తయి ఇంటికి రావాల్సిన కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని కన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె భౌతికకాయాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి చేరుస్తామన్న ‘తానా’ ప్రతినిధుల మాటలతో ఇన్నాళ్లు ఎదురుచూస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పరిమళ విగతజీవిగా బాక్సులో ఇంటికి చేరింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల కడ చూపు కోసంశనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బాక్సును తెరిచారు. కుమార్తె భౌతికకాయాన్ని చూసిన తల్లిదండ్రులు రమాదేవి, గణేష్, తోబుట్టువులు నాగామృతవల్లి, యోగశ్రీ హర్షిత కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చటం బంధుమిత్రులకు కష్టతరమైంది. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.
పరిమళ కుటుంబానికి మనోహర్ పరామర్శ
తెనాలిః అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెనాలి యువతి సూరె నాగశ్రీ వందన పరిమళ కుటుంబసభ్యులను శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. పరిమళ చిత్రపటానికి నివాళుర్పించారు. ప్రమాదం వివరాలను ఆమె తల్లి, తోబుట్టువులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి మృతి
భౌతికకాయాన్ని చూసి కుటుంబం కన్నీరుమున్నీరు
Comments
Please login to add a commentAdd a comment