రేషను డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
తెనాలి: రాష్ట్రప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ ఈ నెల 3వ తేదీన జారీ చేసిన జీవో నెం.32 ప్రకారం తెనాలి డివిజనులోని ఎనిమిది మండలాల్లో నోటిఫికేషన్‌లో పేర్కొన్న చౌకధరల దుకాణాలకు డీలర్లను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజనులోని కాకుమాను, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో డీలర్ల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. వీటిలో వివిధ కారణాలతో ఖాళీ అయిన దుకాణాలు 81, కొత్తగా ఏర్పాటు చేసినవి 71 కలిపి మొత్తం 152 మంది రేషను డీలర్లను నియమించనున్నారు. నిర్దేశించిన నమూనాలో దరఖాస్తులను తెనాలి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నేరుగా ఇవ్వొచ్చన్నారు. రిజిస్టరు పోస్టు ద్వారా కూడా పంపొచ్చని తెలిపారు. అభ్యర్థుల వయసు 18 – 40 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. రాతపరీక్ష 80 మార్కులు, ఇంటర్వ్యూ 20 మార్కులకు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన అర్జీల సంఖ్యను అనుసరించి 5వ తేదీన సంబంధిత అధికారి నిర్ణయించిన ప్రదేశంలో ఉదయం 9.30 గంటలకు రాతపరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షా సమయం రెండు గంటలని, కేంద్రం, సమయం వివరాలను రెండు రోజుల ముందు అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు ఒరిజినల్‌తో గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని వివరించారు. రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల ఫలితాలను 1:5 నిష్పత్తిలో అదేరోజు సాయంత్రం ప్రకటిస్తారు. మరుసటిరోజు ఉదయం 10 గంటల్నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని పొదుపు భవన్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయని అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని స్పష్టంగా తెలిపారు. సివిల్/క్రిమినల్ కేసులు నమోదై ఉండరాదని, స్థానిక ప్రజాప్రతినిధులు అర్హులు కాదని వివరించారు.
తెనాలి డివిజనులో 152 మందికి అవకాశం
అర్జీల దాఖలుకు 30వ తేదీ వరకు గడువు
Comments
Please login to add a commentAdd a comment