ఏటికి ఎదురీత
కొరిటెపాడు(గుంటూరు): రైతుకు ఈ ఏడాది కాలం కలసి రాలేదు. కర్షకులు ఏటికి ఎదురీదారు. ఖరీఫ్ సీజన్‌లో గుంటూరు జిల్లాలో 2,28,315 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఆగస్టు చివరిలో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలకు సుమారు 11 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. తిరిగి సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు 46,680 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. పంటలకు మద్దతు ధర లభించడంలేదు. అయినా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టలేదు.
కాటన్ కాటు
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి బేళ్లకు ధర పడిపోవడంతో మద్దతు ధరకు కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు రాలేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) క్వింటాలుకు రూ.7,521 మద్దతు ధరగా నిర్ణయించి కొనుగోలు చేపట్టినా తేమశాతం నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట మార్కెట్లో కేవలం రూ.6 వేల నుంచి రూ.6,800 వరకు పలకడంతో రైతులు నష్టపోతున్నారు.
బా‘ధాన్యం’
ధాన్యం రైతూ ధరలేక విలవిల్లాడుతున్నాడు. జిల్లాలో ప్రభుత్వం 156 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిల్లో దళారులు, మిల్లర్ల ప్రమేయం ఎక్కువగా ఉంది. ధాన్యం మద్దతు ధర (75 కిలోల బస్తా) రూ.1,725 ఉన్నా రైతులకు దళారులు రూ.1,300 నుంచి రూ.1,400 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు.
చె‘మిర్చి’న కనులు
గతేడాదితో పోలిస్తే మిరప ధరలు సగానికి పడిపోయాయి. గతేడాది సీజన్ ఆరంభంలో క్వింటా మిరప ధర రూ.22 వేలు వరకు పలకగా.. ఈసారి గరిష్టంగా రూ.14 వేలు దక్కడమే గగనంగా ఉంది. సీజన్ ఆరంభంలోనే ఇలా ధరలు పడిపోతే.. కొత్త ఏడాదిలో అత్యధికంగా వచ్చే దిగుబడులను ఎలా అమ్ముకోవాలోనని రైతులు కుమిలిపోతున్నారు.
అన్నదాతా ‘దుఃఖీభవ’
ఖరీఫ్ ముగిసి.. రబీ కూడా సగం గడిచినా కూటమి సర్కారు అన్నదాతా సుఖీభవ ద్వారా ఇస్తాననన్న రూ.20వేలు చెల్లించలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా 1,23,885 మంది రైతులు ఈ ఏడాది రూ.247.77 కోట్లు నష్టపోయారు. పెట్టుబడికి కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గత ప్రభుత్వం అడుగడుగునా అండ
రైతులకు గత ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలిచింది. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తు నుంచి పంట కొనుగోలు వరకు బాసటగా నిలిచింది. ఐదేళ్లపాటు ఏటా ఖరీఫ్ ఆరంభంలోనే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించింది. కౌలు రైతులకూ ఈ పథకాన్ని వర్తింపజేసింది. పత్తి, మిర్చి, వరి పంటలకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించింది. యంత్రసేవా పథకం ద్వారా సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రపరికరాలు అందించింది.
కర్షకులకు కలసిరాని సేద్యం
అధిక వర్షాలతో పంటలకు నష్టం సాగుకు భరోసా ఏదీ? ఉచిత పంటల బీమాకు మంగళం ఆర్‌బీకేల సేవలు నిర్వీర్యం ధాన్యం, పత్తి, మిరపకు దక్కని మద్దతు ధర
రైతులంటే చిన్న చూపు తగదు
కూటమి ప్రభుతానికి రైతులంటే చిన్నచూపు. వారిని ఆదుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. ఖరీఫ్‌లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అయినా సర్కారు పరిహారం అందించలేదు. పెట్టుబడి సాయమూ ఇవ్వలేదు. ఫలితంగా కర్షకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
–టి.వెంకటస్వామి, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment