దేశ ప్రగతికి బాటలు వేసిన మన్మోహన్
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ గతిని ప్రగతి వైపు మరల్చిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభను కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో గురువారం నిర్వహించారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రధాన వక్తగా శివాజీ మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రపంచీకరణ సూత్రాన్ని పాటిస్తూ, సరళీకృత ఆర్థిక విధానాలతో అభివృద్ధి వైపు పరుగులెత్తించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచంలోనే అరుదైన రాజకీయవేత్తగా నిలిచారని కొనియాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అనేక పార్లమెంటరీ ఫైనాన్స్ స్థాయి కమిటీల్లో సభ్యునిగా మన్మోహన్ సింగ్‌తో కలిసి పనిచేసే అదృష్టం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా నిస్వార్థంగా దేశం కోసం పని చేశారని కొనియాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలో పేదలకు పని కల్పించి, పేదరికాన్ని పారదోలేందుకు మన్మోహన్ కృషి చేశారని అన్నారు. దేశ ప్రజలకు సంపూర్ణ విద్య హక్కు కల్పించి చైతన్య పరిచారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యులకు చేరువయ్యారని తెలిపారు. ఆర్థిక సంస్కరణలతో దేశంలో అభివృద్ధి బాటలు పరిచారని కొనియాడారు. ఆయన ప్రధానమంత్రిగా అమలు చేసిన ప్రపంచీకరణ విధానాలతో నేడు దేశ ప్రజలందరూ అభివృద్ధి ఫలాలను ఆస్వాదిస్తున్నారని గుర్తుచేశారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్‌కి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆర్థిక సంస్కరణలను కఠినంగా అమలు చేసే విధంగా సహకరించారని వివరించారు. భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు మాట్లాడుతూ.. ప్రస్తుత దేశ రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ వంటి నాయకులు లేరని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, విధానాలు నిత్యం దేశ ప్రగతికే పరితపించాయని తెలిపారు. గాయకుడు గజల్ శ్రీనివాస్, సాహితీ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా చైర్మన్ వైడీ రామారావు పాల్గొన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు
యలమంచిలి శివాజీ
Comments
Please login to add a commentAdd a comment