సీటు ఇవ్వని చోటే విభాగాధిపతిగా..
తెనాలి: ‘అమ్మా..! వెలుగంటే ఏమిటమ్మా... లోకమంతా నాకు కనిపించినట్లే చీకటిగా ఉంటుందా?’
అంధుడిగా పుట్టిన ఓ బాలుడు మాటలు నేర్చాక తల్లిని అడిగిన ప్రశ్న! అందుకా తల్లి బిడ్డను ఒళ్లోకి తీసుకుని చెమ్మగిల్లిన కళ్లతో...
‘చీకటంటే అజ్ఞానం, వెలుగంటే విజ్ఞానం, చీకటిని చీల్చుకుంటూ వెలుగొస్తుంది... అజ్ఞానాన్ని హరిస్తూ జ్ఞానం ప్రసరిస్తుంది... ప్రభవిస్తుంది నాన్నా ’ అని చెప్పింది.
అప్పట్లో ఆ మాటలు ఎలా అర్థమయ్యాయో తెలీదు... చదువుకోవాలని మాత్రం బాలుడు అనుకున్నాడు. స్పర్శనే కళ్లు చేసుకున్నాడు. బ్రెయిలీ అక్షరాలే నేస్తాలయ్యాయి. ఉన్నత చదువులు చదివారు. ఎందరికో విజ్ఞాన వెలుగులు పంచారు. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఆ ఆచార్యుడి పరిచయమిది. తన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచంలో విజ్ఞాన వెలుగులతో ప్రభవించిన ఆ విద్యావేత్త డాక్టర్ మన్నవ సత్యనారాయణ. సొంతూరు తెనాలి సమీపంలోని దుగ్గిరాల గ్రామ శివారు గాంధీనగర్. వ్యవసాయ కుటుంబంలో 1953 డిసెంబర్ 22న జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, వెంకట్రామయ్య. బిడ్డ పుట్టగానే ఎంతో సంతోషించారు. బిడ్డకు కంటిచూపు లేదని తెలిశాక వారి దుఃఖానికి అవధుల్లేవు. వైద్యం కోసం తిరగని ఆస్పత్రి లేదు. కంటిచూపు రావడం కష్టమని తెలిశాక గుండెను రాయి చేసుకుని పెంచుకున్నారు.
చదువులో మేటి..
ఇంటి సమీపంలోని స్నేహితులతో కలిసి బడికి వెళ్లటం ఆరంభించారు సత్యనారాయణ. చూపు లేకున్నా, తన చెవులనే జ్ఞానచక్షువులుగా చేసుకున్నారు. ఏకసంధాగ్రాహి అనిపించుకున్నాడు. చెప్పిన పాఠాలను గుర్తుంచుకుని, సమాధానాలను రాయటంతో టీచర్లు అబ్బురపడ్డారు. చదువుపై ఆసక్తితో గుంటూరులోని అంధుల పాఠశాలలో చేరారు. బ్రెయిలీ లిపి నేర్చుకున్నాడు. 17వ ఏటనే ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషను పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. 6 – 9 తరగతులు చదవకుండా మెట్రిక్ ఎలా పాసవుతావని తల్లిదండ్రులు, స్నేహితులు వారించారు. అయినా పట్టుదలతో చదివి ఆ ఏడాదే మెట్రిక్ పాసయ్యారు. గుంటూరులోనే హిందూ కాలేజీలో పీయూసీ, డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్లో ఎంఏ చదివి ఫస్ట్‌క్లాసులో పాసయ్యారు.
విద్యార్థులకు బాసటగా...
కేవలం పదేళ్ల సర్వీసులో 21 మంది విద్యార్థులతో పీహెచ్‌డీ చేయించారు. 19 మందితో ఎంఫిల్ డిగ్రీ పూర్తి చేయించారు. యూజీసీ జాతీయ సదస్సులు, పునశ్చరణ తరగతుల నిర్వహణలోనూ పేరు తెచ్చుకున్నారు. 2013లో ఉద్యోగ విరమణ అనంతరం కూడా కొన్నేళ్లపాటు స్వచ్ఛందంగా విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. రోజూ ఆటోలో యూనివర్సిటీకి వెళ్లి విద్యాబోధనతో సంతృప్తి పొందారు. కరోనా విపత్కర పరిస్థితులతో తప్పనిసరై విరామం ప్రకటించారు.
సంగీత, సాహిత్యాలపైనా పట్టు
ఆచార్య మన్నవకు సంగీత సాహిత్యాలంటే ఎంతో అభిరుచి. సాహిత్యాన్ని గురువు ద్వారా నేర్చుకుని, సంగీతంలో స్వీయ సాధన చేశారు. పాత సినిమాల్లోని ఆపాత మధురాలైన పాటలంటే ప్రాణం. మన్నాడే, రఫీ, ముఖేష్, కిషోర్‌కుమార్, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాటలు వింటూ పరవశించిపోతారు. సంగీతం, పాటల పోటీలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరిస్తూ వచ్చారు. తెనాలిలోని ఓ సంగీత, సాంస్కృతిక సంస్థకు గౌరవాధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఇప్పటికీ సాహిత్య సభలకు హాజరవుతుంటారు. శరీరంలో ఓ లోపానికి కుమిలిపోకుండా పట్టుదలతో శ్రమిస్తే జీవితానికి సార్థకత లభిస్తుందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచి అందరికీ ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.
పుట్టుకతో చూపు లేకున్నా
ఉన్నత చదువులు
ఆచార్యుడిగా ఎదిగి ఎందరికో
విద్యాబోధన
సంగీత, సాహిత్యాలతోనే
విశ్రాంత జీవనం
స్ఫూర్తిదాయకం మన్నవ
జీవన ప్రయాణం
నేడు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధనకు మన్నవ దరఖాస్తు చేశారు. ‘ఓ అంధుడు ఎలా పరిశోధన చేస్తారు... ఆయనకు గైడ్‌గా ఎవరుంటారు’ అంటూ నాటి తెలుగు శాఖాధిపతి పట్టించుకోనేలేదు. కానీ ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ముందుకొచ్చారు. అయినా మన్నవ సత్యనారాయణకు సీటిచ్చేందుకు ససేమిరా అన్నారు. చివరకు వీసీ చొరవతో పరిశోధనకు అవకాశం లభించింది. పట్టుదలతో పీహెచ్‌డీ పూర్తిచేసిన మన్నవ.. అదే యూనివర్సిటీలో ఆచార్యుడిగా చేరి, తెలుగు శాఖాధిపతిగా కూడా ఎదిగారు. తనకు సీటిచ్చేందుకు నిరాకరించిన కుర్చీలోనే తాను తలెత్తుకుని కూర్చోగలిగారు. అంతేకాదు... దేశంలో దృష్టిలోపం కలిగిన వారిలో తొలిసారి పీహెచ్‌డీ చేసింది ఆయనే కావటం విశేషం! మన్నవ తన పీహెచ్‌డీ పరిశోధనకు ప్రఖ్యాత రచయిత అడవి బాపిరాజు నవలలు ఎంచుకున్నారు. హిమబిందు, తుపాను, నారాయణరావు, కోనంగి, జాజిమల్లి, నరుడు, అడవి, శాంతిశ్రీ, అంశుమతి, గోనగన్నారెడ్డి నవలల్ని చదివి, తన పరిశోధనా థీసిస్‌ను సమర్పించారు. రొటీన్ పరిశోధక థీసిస్‌లకు భిన్నంగా ఉండటంతో పండితులు, సాహితీవేత్తలు ఆయనను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment