సేద తీరుతున్న పక్షులు
విదేశీ జాతుల విడిది ఇల్లుగా ఉప్పలపాడు పక్షుల కేంద్రం
ఏటా దేశ విదేశాలనుంచి వేల సంఖ్యలో రాక
ప్రకృతి అందాల నడుమ వీక్షించేందుకు ఏర్పాట్లు
పెదకాకాని: ఆహ్లాదకర వాతావరణంలో వేల సంఖ్యలో సేద తీరుతున్న పక్షులతో ఉప్పలపాడు పక్షుల కేంద్రం కొత్త కళ సంతరించుకుంది. జిల్లా కేంద్రమైన గుంటూరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఈ పక్షుల కేంద్రం ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో వాటి పేర్లను తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు.
చిన్నారుల కోసం ఆట వస్తువులు, ఊయలలు అందుబాటులో ఉంచారు. పక్షుల కేంద్రానికి రెండు వైపులా చెరువు కట్టపై పర్యాటకులు కూర్చుని పక్షులను తిలకించేలా బెంచీలు ఏర్పాటు చేశారు. ఏడాది పొడవునా ఎప్పుడు చూసినా ఐదు వేల పక్షులు ఇక్కడ కనువిందు చేస్తుంటాయి. ఏటా సెప్టెంబరు – మార్చి వరకు సుమారు 30 వేల పక్షులు సేద దీరుతుంటాయి.
ఆస్ట్రేలియా, సైబీరియా, చైనా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, అమెరికా నుంచి వలస వస్తున్నట్లు గుర్తించారు. ఇలా వచ్చే 27 రకాల జాతుల్లో దాదాపు 22 రకాలు విదేశాలవే. ఆయా రుతువుల్లో ఇక్కడికి వచ్చి పచ్చని చెట్లపైన ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టడం, పిల్లల్ని చేయడం, ఎగిరే దశకు వచ్చిన తరువాత వాటిని వెంట బెట్టుకుని తిరిగి వెళ్లిపోవడం పక్షులకు అలవాటుగా మారింది. ఈ కేంద్రంలో పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10 చొప్పున టిక్కెట్ రుసుము వసూలు చేస్తారు.
విస్తరిస్తే మరింత మేలు
చెరువు విస్తీర్ణం చాలక కొన్ని పక్షులు ఉదయాన్నే చుట్టు పక్కల చెరువులకు చేరుతున్నాయి. తిరిగి సాయంత్రానికి ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి వస్తున్నాయి. వాటికోసం అధికారులు ఇనుప స్టాండ్‌లు ఏర్పాటు చేశారు. పది ఏళ్ల కిందట పక్షులకు చెరువు చాలడం లేదని గుర్తించిన అధికారులు చెరువు విస్తీర్ణం పెంచేందుకు పక్కనే ఉన్న పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు కూడా పంపించారు. పొలం యజమానులు, అధికారులు ఏకాభిప్రాయానికి రాలేదు. అది కాస్తా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఉన్నతాధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని విస్తరించి పర్యాటక కేంద్రంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సందర్శకులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment