ప్రభువా మాకెందుకు అన్యాయం చేశావయ్యా...
సత్తెనపల్లి: ఈత సరదా కోసం వెళ్లి ఇద్దరు మృతి చెందగా ముగ్గురు ప్రాణాలతో బయటపడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రఘురామ్‌నగర్‌కు చెందిన బైకం.మహేష్, రౌతు ధరణికుమార్, మున్సిపల్ ఏరియాకు చెందిన గొడుగుల హర్ష వరుణ్, వడ్డవల్లి శాస్తీనగర్‌కు చెందిన నల్లూరి గోపీచంద్, రాజులకాలనీకి చెందిన పొదిలి చరణ్‌లు పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర బాలకుటీర్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు మంచి స్నేహితులు కావడం, ఆదివారం సెలవు రావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని ఐదుగురు కలిసి సుమారు మూడు గంటల సమయంలో ఈతకు పయనమయ్యారు. గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో బి.మహేష్, జి.హర్షవరణ్, రౌతు ధరణికుమార్ ఒకచోట దిగగా.. నల్లూరి గోపీచంద్, పొదిలి చరణ్ మరోచోట ఈతకు దిగారు. గోపీచంద్, చరణ్ దిగిన చోట కాలువలో లోతు ఎక్కువగా ఉండడంతో వారిద్దరూ గల్లంతయ్యారు. దీంతో మిగిలిన ముగ్గురూ భయాందోళన చెంది కాలువ నుంచి ఒడ్డుకు చేరుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ స్థానికంగా ఉన్నవారికి చెప్పి విలపించారు.
ముమ్మర గాలింపు చర్యల తర్వాత..
స్ధానికులు, పిల్లల కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఒక్కసారిగా అందరూ కాలువ వద్దకు చేరుకున్నారు. గోపీచంద్, చరణ్ కనిపించకపోవడంతో గజ ఈతగాళ్లతో పట్టణ సీఐ బి.బ్రహ్మయ్య, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అరగంట పాటు వెతికిన తర్వాత పొదిలి చరణ్(15) మృతదేహం కనిపించింది. చరణ్ మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీసి సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాల కు తరలించారు. చరణ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గోపీచంద్ గల్లంతై కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెల బాదుకుంటూ రోదించారు. గల్లంతైన గోపీచంద్ కోసం సీఐ బ్రహ్మయ్య, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్లని దింపి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో లైట్లు తీసుకువచ్చి ప్రోక్లెయిన్‌తో సమీపంలోని చెట్లను తొలగింపు చేపట్టారు. ఎక్కడైతే గోపిచంద్ గల్లంతు అయ్యాడో అక్కడ 50 మందిని కాలువలోకి దించి ఒకరికొకరు చేతులు పట్టుకొని అరకిలోమీటర్ ముందుకు సాగితే కనిపించే అవకాశం ఉంటుందని భావించి ఆ మేరకు చర్యలు చేపట్టగా 8.40 గంటలకు నల్లూరి గోపిచంద్(15) మృతదేహం కనిపించింది. విద్యార్థులు గల్లంతైన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున సమీప ప్రాంత ప్రజలు కాలువ వద్దకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.
చదువుకునేందుకు వచ్చి..
ఈతకు వెళ్ళి గుంటూరు బ్రాంచ్ కెనాల్ కాలువలో మృతి చెందిన పొదిలి చరణ్‌ది యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామం. పొదిలి భాస్కర్, కృష్ణకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు పొదిలి.చరణ్‌ను సత్తెనపల్లి రాజుపాలకాలనీలో లస్కర్‌గా పని చేస్తున్న తాతయ్య రాచకొండ జగన్నాథం వద్ద ఉంచారు. రెండేళ్ల నుంచి చరణ్ ఇక్కడే ఉంటూ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి కాలువలో గల్లంతై మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చదువుకునేందుకు వచ్చి విగతజీవిగా మారావా అంటూ రోదించారు.
ప్రభువా మేము నీకు ఏ లోటు చేశాం తండ్రీ. మాకెందుకు ఇంత అన్యాయం చేశావయ్యా అంటూ గల్లంతై మృతి చెందిన నల్లూరి గోపీచంద్ తల్లిదండ్రులు కిరణ్‌కుమార్, సుహాసిని రోదిస్తున్నారు. కిరణ్ కుమార్ పట్టణంలోని ప్రైవేట్ బ్యాంకు వద్ద, సుహాసిని నరసరావుపేటలోని ప్రైవేట్ వైద్యశాల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తూ పట్టణంలోని వడ్డవల్లి శాసీ్త్రనగర్‌లో ఉంటూ జీవనం వెళ్ళదీస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. తాము చదువుకోలేక పోయామని బిడ్డలు ఇద్దరైనా ప్రయోజకులు కావాలని పెద్ద కుమారుడు ప్రసన్నకుమార్‌ను గుంటూరులో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు గోపిచంద్‌ను సత్తెనపల్లిలో తొమ్మిదో తరగతి చదివిస్తున్నారు. చిన్న కుమారుడు స్నేహితులతో కలిసి వెళ్లి కాలువలో గల్లంతై మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.
Comments
Please login to add a commentAdd a comment