ఒకటికి పది సార్లు అడిగినా జవాబు శూన్యం
నగరంపాలెం: జీఎంసీ నిధుల ఖర్చుపై కౌన్సిల్ సమావేశంలో అధికారులను ఒకటికి పదిసార్లు అడిగినా తగిన జవాబు రాలేదని డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. ఈ నెల 4వ తేదీన జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో జరిగిన అంశాలపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతపై తమపై ఉందని పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కార్పొరేటర్లు వంగల హేమలత, ధూపాటి వంశీ, అచ్చాల వెంకటరెడ్డి, ఈచంపాటి వెంకట కృష్ణమాచారి (ఆచారి), ఆడకా పద్మావతి, బూసి రాజలత, పడాల సుబ్బారెడ్డి, యాట్ల రవి, పఠాన్ రిహానా, అబీద్, పాపతోటి అంబేడ్కర్, వంగల హేమలత, కాండ్రుకుంట గురవయ్య, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు గేదెల రమేష్, పూనూరి నాగేశ్వరరావులతో కలసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డైమండ్ బాబు మాట్లాడుతూ... జీఎంసీ పరిధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎన్ని? ఎంత విత్‌డ్రా చేశారు? విత్‌డ్రా చేస్తే ఎందుకు చేశారు? అనే అంశాలపై వివరాలు అడిగితే సమావేశంలో అధికారుల నుంచి సమాధానం రాలేదన్నారు. ఇది పరిపాలన అంశమని ఎవరు రాశారని అడగ్గా సమాధానం చెప్పలేదన్నారు. ‘57 మంది ప్రజా ప్రతినిధులకు మీరిచ్చే జవాబు ఇదేనా.. తమాషా చేస్తున్నారా?’ అని తాను అడిగానని గుర్తుచేశారు. ఒకటికి పదిసార్లు అడిగిన తర్వాత కమిషనర్ లేచి, ఇందులో రాసిన ప్రతి దానికి తనదే బాధ్యత అని మౌనంగా కూర్చున్నారని తెలిపారు. సరైన సమాధానం మాత్రం చెప్పలేదన్నారు. కమిషనర్ మైకు విసిరేసి, కాగితాలు చించి వేయడం చూసి ఆశ్చర్యమేసిందని చెప్పారు. ఏదైనా ఉంటే మేయర్‌తో మాట్లాడాలని, బాయ్‌కాట్ మంచిది కాదన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ‘తమాషా చేస్తున్నారా?’ అని కమిషనర్‌ని ప్రశ్నించలేదని, పరిపాలన అంశమని రాసింది ఎవరని అడిగానని గుర్తు చేశారు. పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతం చూపిస్తున్నారని గుత్తేదార్లు చెప్పారన్నారు.
పది రోజుల్లోనే చెల్లింపులా?
గతేడాది ఆగస్టులో విజయవాడలో వరద బాధితుల సహాయర్థం రూ.9.22 కోట్ల విలువ చేసే ఆహారపు పొట్లాలు, బిస్కెట్లు, పాలు, నీటి సీసాలు ఇతరత్రా పంపించారన్నారు. సాయంలో అభ్యంతరం లేదని, పంపిన విధానంలో కమిషనర్ వ్యక్తిగత అజెండాగా కనిపిస్తోందని డైమండ్ బాబు ఆరోపించారు. ఈ పంపిణీ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేలు, కౌన్సిల్ సభ్యులకు తెలియలేదన్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పది రోజుల్లో డబ్బులు చెల్లించారని ఆరోపించారు. పంపిణీ దారులు ఎవరు? వారి అర్హతలు ఏంటి? వంటివి విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఇదంతా బుడమేరు బాధితులకు చేరిందా? అనేది నిరూపించాల్సిన బాధ్యత కమిషనర్‌పై ఉందని పేర్కొన్నారు. నిధులు ఇష్టారాజ్యంగా వాడుకుంటే ప్రజలు క్షమించరని అన్నారు. ఐఏఎస్ అధికారిగా కమిషనర్ ప్రవర్తించడం లేదని, వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో ధర్నా చేయించడాన్ని ఒకసారి పరిశీలిస్తే వారిని తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ పన్నిన కుట్రలో భాగమని ఆరోపించారు. కమిషనర్ కూడా అధికార పార్టీ మెప్పుకు యత్నిస్త్తున్నారని పేర్కొన్నారు.
‘తమాషా చేస్తున్నారా..?’ అని కమిషనర్‌ను ప్రశ్నించలేదు విజయవాడ వరద బాధితులకు రూ.9.22 కోట్లు ఖర్చు పంపిణీ వెనుక కమిషనర్ వ్యక్తిగత అజెండా కనిపిస్తోంది విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు
Comments
Please login to add a commentAdd a comment