పెన్షన్ అందక విశ్రాంత ఆచార్యులకు ఇక్కట్లు
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సుదీర్ఘకాలం సేవలు అందించి నేడు విశ్రాంత జీవనం గడుపుతున్న ఆచార్యులు సమయానికి పెన్షన్ అందక ఇక్కట్లు పడుతున్నారు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం పెన్షన్‌పైనే ఆధారపడటంతో ఎక్కువమందికి అవస్థలు తప్పడం లేదు. సుమారు 148 మంది బోధన, 522 మంది బోధనేతర సిబ్బంది వర్సిటీలో పెన్షన్‌దారులుగా ఉన్నారు. వీరి వివరాలను ప్రతి నెలా వర్సిటీ నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ పోర్షన్ పెన్షన్‌ను మినహాయించకుండా చెల్లింపులు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్సిటీలకు సమాచారమిచ్చింది. దానికి అనుగుణంగా సవరణలు చేసి ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరచాల్సి ఉంది. నాగార్జున వర్సిటీ మాత్రం ఈ నిబంధన ప్రకారం సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరచలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు పెన్షన్ ఇవ్వలేదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆరా తీయగా విషయం వెల్లడైంది. అధికారిక సమాచారం లేకనే పాత విధానంలోనే వివరాలు నమోదు చేశామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తర్వాత కొత్త విధానంలో నమోదు చేశారు. తీరా ఆ పెన్షన్ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని, కొన్ని రోజులు ఆగాలని చెప్పినట్లు తెలిసింది. ఇతర వర్సిటీలు సొంత నిధుల నుంచి పెన్షనర్లకు చెల్లింపులు చేశాయని, తమకూ సుమారు రూ.1.59 కోట్లను ఇలా చెల్లించాలని పింఛనుదారులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి రాగానే తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఏఎన్‌యూ అధికారులు మాత్రం సొంత నిధులు కూడా లేవని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో పెన్షన్ ఎప్పటికి వస్తుందో తెలియని స్థితిలో విశ్రాంత ఆచార్యులు ఉన్నారు.
ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ఆలస్యం ప్రభుత్వం, ఏఎన్‌యూల మధ్య సమన్వయలోపం
Comments
Please login to add a commentAdd a comment