వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు
తాడేపల్లి రూరల్ : త్రిదండి చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మంగళగిరి బాపూజీ విద్యాలయంలో 19వ రోజు 19వ పాశురాన్ని భక్తులకు ఆయన వివరించారు. అనంతరం గోదా అమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా సీతానగరం జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ.. పలు ప్రాంతాల నుంచి సుమారు 700 మంది భక్తులు గోదా అమ్మవారికి సారె సమర్పించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి.
మహిళా కానిస్టేబుల్
అభ్యర్థులకు పరీక్షలు
నగరంపాలెం: గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 216 మంది హాజరయ్యారు. 26 మందికి ధ్రువపత్రాలు లేకపోవడంతో వెనక్కు పంపారు. మిగతా వారిలో 10 మందికి బరువు, ఎత్తు కొలతలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. 113 మందికి 100 మీటర్ల పరుగు పందెం పోటీలు జరగ్గా ఐదుగురు, 113 మందికి లాంగ్ జంప్ నిర్వహించగా 106 మంది అర్హత పొందారు. మొత్తమ్మీద 198 మందికి దేహదారుఢ్య పరీక్షలు జరగ్గా, 106 మంది అర్హత సాధించారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. జిల్లా ఏఎస్పీలు కె.సుప్రజ (క్రైం), ఎ.హనుమంతు(ఏఆర్) పాల్గొన్నారు.
నారా లోకేష్‌ను కలిసిన స్కేటింగ్ క్రీడాకారిణి
తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేష్‌ను మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి మాత్రపు జెస్సీ రాజ్ శుక్రవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. జెస్సీ రాజ్ ఇటీవల రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు అందుకుంది. స్కేటింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందుకు ఈ పురస్కారం దక్కింది. ఆమెను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆమెతోపాటు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
జీఎన్‌ఎం వార్షిక
పరీక్షలు ప్రారంభం
గుంటూరు మెడికల్: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో జిల్లా వ్యాప్తంగా 36 నర్సింగ్ స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 11 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. తొలిరోజు 1500 మందికిగాను ఫైనల్ ఇయర్ విద్యార్థులు 20 మంది, ఫస్ట్ ఇయర్ వారు 94 మంది గైర్హాజరైనట్లు గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ కోటా సుజాత తెలిపారు. పరీక్షల చీఫ్ ఎగ్జామినర్‌గా గుంటూరు జీజీహెచ్ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బత్తుల వెంకట సతీష్‌కుమార్ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment