స్టాంప్ పేపర్‌కూ ‘ఆధారే’!
గుంటూరు వెస్ట్ : జిల్లాలోని స్టాంపు వెండార్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం వీరితోపాటు ప్రజలకు కూడా కష్టాలు తెచ్చిపెడుతోంది. గతంలో స్టాంపు కావాలంటే నేరుగా వెండార్ వద్దకు వెళ్లిగానీ, ఎవరినైనా పంపించిగానీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాంపు కావాల్సిన వారే వెళ్లాలి. ఆధార్ కార్డు నెంబరు ఇచ్చి వారి ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలి. అప్పుడు కంప్యూటర్‌లో నమోదు చేసి స్టాంపు ప్రింట్ తీసి ఇస్తారు. స్టాంపు కోసం కనీసం 15 నిమిషాలకుపైనే పడుతోంది. ఆన్‌లైన్‌లో ఆధార్ ఓపెన్ కాకపోతే స్టాంపు లభించదు.
కంప్యూటర్ తదితరాలు అవసరం
ప్రతి స్టాంపు వెండార్ ఒక దుకాణంతోపాటు కంప్యూటర్, ప్రింటర్, డిస్‌ప్లే ఏర్పాటు చేసుకోవాలి. ఈ వృత్తిలో చాలా మంది పెద్దవారు ఉన్నారు. అరకొర ఆదాయంతో ఇంత సెటప్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. చాలామందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. పైగా స్టాంపుల విక్రయం అరకొరగానే ఉంటోంది. రోజు సంపాదించే రూ.మూడు నాలుగొందలతోనే జీవిస్తున్నారు. వారందరూ వృత్తికి దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. గడిచిన నెల రోజుల నుంచి కనీసం తీసుకున్న స్టాకులో 5 శాతం కూడా స్టాంపు వెండార్లు విక్రయించలేదు.
ఐజీ కార్యాలయం ఏకపక్ష నిర్ణయం
కొత్త విధానం అమలులో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖాధికారుల పాత్రే కీలకం. కనీసం జిల్లా రిజిస్ట్రార్లకు, సబ్ రిజిస్ట్రార్లకు, స్టాంపు వెండార్లకు ముందు చెప్పకుండానే అమలు చేస్తున్నారు. వెండార్ స్టాంపులు విక్రయించాలంటే ముందుగా కంప్యూటర్‌లో లాగిన్ అవ్వాలి. దీనికి ఒక ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి. 15 నిమిషాలు కంప్యూటర్ వాడకపోతే మళ్లీ వ్యవహారం మొదటికే వస్తుంది. పాత తేదీల్లో స్టాంపులు విక్రయించకుండా ఈ విధానం తెచ్చామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆ తరహా కొనుగోలు దాదాపుగా ఆగిపోయింది. పాత తేదీల్లో అగ్రిమెంట్లు రాసుకున్నా అవి పనికిరావు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారమే ఫీజులు చెల్లించాలి. తమను సాగనంపేందుకే ఇలా చేస్తున్నారని వెండార్లు వాపోతున్నారు. ఇప్పటికే అధికారులకు తమ సమస్యలను వివరించామని పేర్కొన్నారు.
అడ్డగోలు నిబంధనలతో వెండార్లకు తిప్పలు ఆధార్ నంబర్ ఇచ్చి, ఓటీపీ చెబితేనే లభ్యం కంప్యూటర్, ప్రింటర్ వంటి సామగ్రి తప్పనిసరి అసలే అరకొరగా సాగుతున్న అమ్మకాలు
చాలా ఇబ్బందులు
కొత్త విధానంలో నిబంధనల అమలు సాధ్యం కావడం లేదు. ఆధార్ కార్డు నెంబర్, ఓటీపీ చెప్పమంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు. రోజుకు రూ.500 కూడా ఆదాయం రాని వెండార్లు... ప్రత్యేకంగా షాపు, కంప్యూటర్, ప్రింటర్ వంటివి ఏర్పాటు చేసుకోవడం ఇబ్బందికరమే. చాలా మంది స్టాంపుల విక్రయాలు ఆపేస్తున్నారు. ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు అందించాం.
– షేక్ రషీద్, స్టాంపు వెండార్ల సంఘం
జిల్లా జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment