న్యాయమూర్తులకు మధ్య వర్తిత్వంపై శిక్షణ తరగతులు
నగరంపాలెం: న్యాయమూర్తులు మధ్యవర్తిత్వంపై నైపుణ్యాన్ని పెంపొందించుకుని సుప్రీంకోర్టుకు అనుగుణంగా మధ్యవర్తిత్వంలో భాగస్వాములు కావాలని సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటి నుంచి హాజరైన అడ్వకేట్ ప్రమీల ఆచార్య (రాజస్థాన్), అడ్వకేట్ వి.పి.తంకచన్ (కేరళ) అన్నారు. సుప్రీంకోర్టు మీడియేషన్, కాన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటి (న్యూఢిల్లీ) ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వం నలభై గంటల శిక్షణా తరగతులు జిల్లా పోలీస్ కార్యాయల ఆవరణలోని హాల్‌లో ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్ధసారథి, జిల్లా కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) టి.లీలావతి మాట్లాడారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందాక న్యాయమూర్తులు మధ్యవర్తులుగా ప్రత్యేక పాత్ర పోషిస్తారని వక్తలు అన్నారు. శిక్షణా కార్యక్రమంలో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సివిల్ జడ్జిలు (జూనియర్, సీనియర్ డివిజన్), జిల్లా జడ్జిలు, అధికారులు పాల్గొన్నారు.
159 మంది మహిళా కానిస్టేబుళ్ల అభ్యర్థులకు అర్హత
నగరంపాలెం: స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో మహిళా కానిస్టేబుళ్ల అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు సోమవారం జరిగాయి. 331 మంది మహిళా అభ్యర్థులు హాజరవ్వగా, 43 మంది సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకాకపోవడంతో వెనుదిరిగారు. మిగతా 288 మందికి శరీర కొలత పరీక్షలు నిర్వహించగా, అందులో 14 మంది బరువు, ఎత్తు కొలతలు సరిలేకపోవడంతో తిరస్కరించారు. మిగతా 274 మందికి 1600 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా, 105 మంది అర్హతను కోల్పోగా, 169 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 169 మందికి 100 మీటర్ల పరుగు పందెం పోటీలు చేపట్టగా 21 మంది అర్హత సాధించగా, 148 మంది అర్హత సాధించలేకపోయారు. 169 మందికి లాంగ్ జంప్ పోటీలు జరగ్గా, 159 మంది అర్హత సాధించగా 10 మంది అనర్హత పొందారు. 288 మంది మహిళా కానిస్టేబుళ్ల అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా, 159 మంది అర్హత సాధించగా, మరో 129 మంది అర్హత కోల్పోయారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీలు (క్రైం) కె.సుప్రజ, ఎ.హనుమంతు (ఏఆర్) పర్యవేక్షించారు.
సంక్రాంతికి
ప్రత్యేక బస్సులు
పట్నంబజారు: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎం.రవికాంత్ తెలిపారు. సోమవారం ఆర్టీసీ బస్టాండ్‌లోని ఆయన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు సాధారణ చార్జిలతో స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు 103, తెనాలికి 11, మంగళగిరి 12, పొన్నూరు 17 బస్సు సర్వీసులను ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు నడుపుతారని, 15 నుంచి 19 వరకు హైదరాబాద్, బెంగళూరు, చైన్నెకు ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 9 నుంచి 13 వరకు బెంగళూరు నుంచి మూడు, చైన్నె నుంచి ఆరు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ సోమవారం తెలిపారు. కాచిగూడ–శ్రీకాకుళం రోడ్డు (07615) మధ్య ప్రత్యేక రైలును ఈనెల 11, 15 తేదీలలో నడపనున్నట్టు వెల్లడించారు. శ్రీకాకుళం రోడ్డు–కాచిగూడ(07616) మధ్య ఈనెల 12, 16 తేదీలలో ప్రత్యేక రైలును నడపనున్నట్టు పేర్కొన్నారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు( 07617) మధ్య ఈనెల 8న, శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి(07618) మధ్య ఈనెల 9న ప్రత్యేక రైళ్లు నడుస్తాయని డీసీఎం వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment