దారి తప్పిన సాయం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: విజయవాడ బుడమేరు వరదల సమయంలో గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన సహాయక చర్యల నిధులు దారి తప్పాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ మంత్రి ఆదేశాల మేరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్ రూ.9 కోట్ల 22 లక్షల నిధులను ఖర్చు చేసి ఫుడ్‌ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లు, బిస్కెట్లు, బ్రెడ్లు, పాల ప్యాకెట్లు వరద ప్రాంతాలకు పంపారు. ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు. వాస్తవానికి నగరపాలక సంస్థ కమిషనర్‌కు రూ.10 లక్షల వరకే సొంతంగా ఖర్చు చేయడానికి అధికారం ఉంది. స్టాండింగ్ కమిటీ అనుమతితో రూ.50 లక్షల వరకూ ఖర్చు చేయొచ్చు. అంతకు మించి రూపాయి ఖర్చు చేయాలన్నా కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేసైనా ఆమోదం తీసుకోవాలి. కానీ కమిషనర్ ఆ పని చేయలేదు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, కేంద్ర సహాయ మంత్రికీ సమాచారం ఇవ్వలేదు. కనీసం ఇన్ని లక్షల ప్యాకెట్ల ఫుడ్‌ను తయారు చేసి పంపుతున్నామన్న సమాచారం మీడియాకూ ఇవ్వలేదు. అంతా రహస్యంగా చేశారు. గుంటూరులో తయారు చేసిన ఫుడ్ ప్యాకెట్లు ఎక్కడికి సరఫరా చేశారు? ఎక్కడ పంపిణీ చేశారన్న సమాచారమూ అసలు లేదు. నాలుగు రోజుల్లో 17,00,964 ఫుడ్ ప్యాకెట్లు(బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి), 3,31,800 వాటర్ బాటిళ్లు, రెండు లక్షల పది వేల బిస్కెట్ ప్యాకెట్లు, 3180 బ్రెడ్ ప్యాకెట్లు, 13,68,992 పాలప్యాకెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఫుడ్ ప్యాకెట్ల సరఫరాకు కేవలం 8 వేల సంచులు వాడి నట్లు చెబుతున్నారు. అంటే ఒక్కో సంచిలో సగటున 212 ఫుడ్‌ప్యాకెట్లు పంపినట్టు. ఇదెలా సాధ్యం? బిస్కెట్, బ్రెడ్ ప్యాకెట్లు ఎలా పంపారో తెలియదు.
అన్నీ కాకిలెక్కలే!
అధికారుల లెక్కలన్నీ కాకిలెక్కలేనని, వీటిపై చర్చ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్న డెప్యూటీ మేయర్ ప్రశ్నతో భయం పుట్టిన మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్‌ను బహిష్కరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ చెల్లించిన బిల్లులకు జీఎస్టీ ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొటేషన్లు కూడా తీసుకోకుండా బిల్లులు చెల్లించేసినట్లు సమాచారం.
అధికారుల ఖాతాల్లోకి నిధులు!
అధికారుల ఖాతాల్లోకి నిధుల మళ్లింపుపైనా అను మానాలు తలెత్తుతున్నాయి. ఓ ఈఈ పేరుతో రూ.కోటి, మరొక ఈఈ పేరుతో రూ.50 లక్షలు చెల్లించారు. మరో ఏఈ ఖాతాలోకి నేరుగా బిల్లులు చెల్లించారు. ఇలా అధికారుల ఖాతాలలోకి నిధులు ఎలా జమ చేస్తారని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించా లని డెప్యూటీ మేయర్ డైమండ్ బాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మిని మేయర్ మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, కార్పొరేటర్లు సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే పెద్ద కుంభకోణం బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అవినీతి బయటపడుతుందనే కౌన్సిల్‌ను బహిష్కరించారా? బుడమేరు వరద పేరుతో నిధుల దుర్వినియోగం కౌన్సిల్‌కు తెలియకుండానే ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు నాలుగు నెలలు దాటినా కౌన్సిల్ ముందుకు రాకుండా దాచిపెట్టిన వైనం డెప్యూటీ మేయర్ ప్రశ్నతో వెలుగులోకి వచ్చిన అంశం విజిలెన్స్ విచారణ కోరుతున్న వైఎస్సార్ సీపీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మేయర్, డెప్యూటీ మేయర్
సామర్థ్యానికి మించి సంగం పాలప్యాకెట్లు సరఫరా
వరదల నాలుగు రోజుల్లో సంగం డెయిరీ నుంచి 13,58,992 పాలప్యాకెట్లు పంపారు. అంటే సగటున రోజుకు 3.40 లక్షల పాల ప్యాకెట్లను సంగం నుంచి సరఫరా చేశారు. రోజుకు లక్షా 15 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సంగం తన సామర్థ్యాన్ని మించి ఎలా సరఫరా చేసింది? అంత మొత్తం విజయవాడకే తరలిస్తే మిగిలిన ప్రాంతాలలో పాల సరఫరాకు ఆటంకం ఎందుకు రాలేదు? అని ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment