కోవిడ్ తరహా ‘క్రిమి’నల్
అప్రమత్తత అవసరం
హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లరాదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– డాక్టర్ కొర్రా విజయలక్ష్మి,
డీఎంహెచ్‌ఓ, గుంటూరు జిల్లా
దీర్ఘకాలిక వ్యాధి బాధితులకు ఇబ్బంది
హెచ్‌ఎంపీవీ నార్మల్ ఫ్లూ మాదిరాగానే ఉంది. పదేళ్లలోపు చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తమా, కిడ్నీ వ్యాధులు, షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. మాస్క్‌లు ధరించడం, తగినంత నీటిని తీసుకోవడం ఉత్తమం.
– డాక్టర్ బి.దుర్గాప్రసాద్, పల్మనాలజిస్ట్, గుంటూరు
గుంటూరు మెడికల్: కోవిడ్ తరహా మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందా? ఊపిరి తీసే వైరస్ దేశంలోకి ప్రవేశించిందా? తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ) వైరస్ కేసులు మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో నమోదు కావడంతో అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రానికి గుజరాత్, చైన్నె, కోల్‌కతా తదితర ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూడడంతో దేశవ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. కోవిడ్ వైరస్ చాపకిందనీరులా వ్యాపించి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి మరణ మృదంగం మోగించిన భయానక పరిస్థితులు ప్రజల మది నుంచి ఇంకా చెరిగిపోక ముందే మరో వైరస్ పొంచి ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.
లక్షణాలు ఒకేలా ఉన్నాయి
కరోనా, హెచ్‌ఎంపీవీ లక్షణాలు ఒకే విధంగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొత్త వైరస్ తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై పెనుప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. హెచ్‌ఎంపీవీ తుమ్ములు, దగ్గుతో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. తరచూ చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంటున్నారు.
పొంచిఉన్న మరో మహమ్మారి ముప్పు దేశంలోనూ హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు కరోనా మాదిరిగా ఊపిరితిత్తులపై ప్రభావం అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
చేయాల్సిన పనులు
దగ్గినా, తుమ్మినా ముఖానికి చేతిరుమాలు అడ్డుపెట్టుకోవాలి
బహిరంగ ప్రదేశాల్లో దగ్గినా, తుమ్మినా వచ్చినప్పుడు కళ్లెను ఎక్కడబడితే అక్కడ ఉమ్మి వేయరాదు.
చేతులను తరచుగా సబ్బుతో, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి
భౌతిక దూరం పాటించాలి
సరిపడా నీటిని తాగాలి, రోజుకు కనీసం మూడు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం మంచిది
ఎనిమిది గంటల సంపూర్ణ నిద్ర అవసరం
చేయకూడని పనులు
కరచాలనం చేయకూడదు
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి
కళ్లు, ముక్కు, నోరు చేతులతో రుద్దుకోకూడదు
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు
వైద్యుల సలహాలు లేకుండా సొంతంగా మాత్రలు వేసుకోవద్దు
Comments
Please login to add a commentAdd a comment