కౌలు రైతులకు పంట రుణాలు
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని కౌలు రైతులు పంట రుణాలు తీసుకునేందుకు సమీపంలోని బ్యాంకులను సంప్రదించాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. వారికి రుణాలివ్వాలని జిల్లాలోని బ్యాంకులు, ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఇబ్బందులు ఎదురైతే 0863–223 2953 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. పొలం యజమానులు పంట రుణం తీసుకోకపోతే తప్పనిసరిగా కౌలు రైతులకు ఇస్తారని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 5,667 మంది కౌలు రైతులకు రూ.36.80 కోట్లు పంట రుణాలు మంజూరు చేశామని వివరించారు.
ఫార్మాసిస్టు గ్రేడ్–2
మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో ఫార్మాసిస్టు గ్రేడ్–2 పోస్టుల ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర శనివారం తెలిపారు. ఫైనల్ మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10వ తేదీలోపు తమ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు.
ఎయిడెడ్ స్కూల్‌ను
సందర్శించిన డీజీపీ
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని కృష్ణానగర్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలను శనివారం డీజీపీ, పాఠశాల పూర్వ విద్యార్థి సీహెచ్ ద్వారకా తిరుమలరావు సందర్శించారు. 1974లో ఇదే పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన్ను సహచర పూర్వ విద్యార్థులు సన్మానించారు. సహచర పూర్వ విద్యార్థులు, పాఠశాల పాలకవర్గ ఆహ్వానంపై పాఠశాలకు యూనిఫాంతో డీజీపీ వచ్చారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఇలా వచ్చినట్లు చెప్పారు. పాఠశాలలో చదివిన సమయంలో ఉన్న అడ్మిషన్ రిజిస్టర్‌లో తన పేరు, వివరాలను ఆయన చూసుకున్నారు. కోబాల్డ్‌పేటకు చెందిన చిన్ననాటి మిత్రుడు షరీఫ్‌ను పలకరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థి డాక్టర్ ఓవీ రమణ, పాఠశాల కరస్పాండెంట్ తూములూరి శ్రీరామమూర్తి, కార్యదర్శి తూములూరి సమ్మోహిత్, మాజేటి గురవయ్య , ప్రిన్సిపల్ మాధవపెద్ది విజయలక్ష్మి, హెచ్‌ఎం చిలుకూరి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలి
నరసరావుపేట రూరల్: విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు డిసెంబర్ నెల జీతాలు అందలేదని, వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. డిసెంబర్ జీతాలు కొన్ని ఉద్యోగ శాఖల పెన్షనర్లకు చెల్లించారని, విద్యాశాఖలోని దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు నేటి వరకు అందలేదని తెలిపారు. బ్యాంక్ లోన్లు, ఈఎంఐల చెల్లింపులు, నూతన సంవత్సరం ఖర్చుల రీత్యా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని అసోసియేషన్ నాయకులు పమ్మి వెంకటరెడ్డి, బెజ్జం సంపత్‌బాబు, కొమ్ము కిషోర్‌లు కోరారు.
ప్రకృతి వైపరీత్యాలపై
అవగాహన అవసరం
వేటపాలెం: ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో విద్యార్థులు ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలో అవగాహన కలిగి ఉండాలని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు (ఎన్డీఆర్‌ఎఫ్) టీం కమాండర్ ఇన్‌స్పెక్టర్ ముఖేష్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం పందిళ్లపల్లి జెడ్పీహెచ్ పాఠశాలలలో ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు విపత్తులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శన చేసే చూపించారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వచ్చిన సమయంలో ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఛాతి కుదింపులతో కూడిన అత్యవసర చికిత్స విధానం గురించి వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment