గుంటూరు మెడికల్: తల్లి జన్మనిస్తే.. అవయవదానం పునర్జన్మనిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఐదో మహాసభ, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు (స్పెక్ట్) 21వ వార్షికోత్సవం, సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన అభినందనీయం అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఐదు లక్షల మంది అవయవాల కోసం పేర్లు నమోదు చేయించుకున్నట్లు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఎనిమిది మందికి నూతన జీవితం ప్రసాదించవచ్చని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలేను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆమె మహిళల విద్యకు, సామాజిక సంస్కరణకు చేసిన కృషి అన్నారు. గతేడాది కంటే ఈ సారి 60 నుంచి 70 శాతం ట్రాన్స్‌ప్లాంటేషన్లు, డోనర్స్ పెరిగారన్నారు. 65 మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారని, 205 ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరిగాయన్నారు. స్పెక్ట్ సేవలను కొనియాడారు. పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఎవరైనా అవయవాలు విక్రయిస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో విజయవాడలో జరిగిన సంఘటనపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవా రంగాన్ని ఎంచుకున్నారని, తొలుత వారు అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ.. స్పెక్ట్ సంస్థ సేవలను అభినందించారు. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా తమ సంస్థ సేవలు అందిస్తోందన్నారు. ఆర్గాన్ డొనేషన్ చేసేవారికి ప్రభుత్వం రూ. 10 వేలు ప్రోత్సాహకం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. స్పెక్ట్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ.. గుంటూరు జీజీహెచ్‌ను ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌గా అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నారు. విద్యార్థులకు అవయవదానంపై పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని, డ్రైవింగ్ లైసెన్సు మంజూరు సమయంలో అవయవదానం ప్రతిజ్ఞ చేయించాలన్నారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేకు స్పెక్ట్ సంస్థ తరఫున సావిత్రిబాయి పూలే జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. జీవితం చాలా చిన్నదని, ప్రతి జీవి సంఘానికి ఏదో ఒకటి చేయాలన్నారు. గుంటూరు వైద్య కళాశాలకు తన శరీరాన్ని దానంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులకు కూడా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment