ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి
గుంటూరు వెస్ట్ : నగరంలోని శంకర్ విలాస్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సమయంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా రహదారులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో దీనికి సంబంధించి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాథమిక ప్లానింగ్ ప్రకారం అమరావతి రోడ్డు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా బస్టాండ్ వైపునకు, లైట్ మోటారు వాహనాలు పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి మూడు వంతెనల వైపునకు మళ్లించాలన్నారు. లక్ష్మీపురం వైపు నుంచి వచ్చే వాహనాలను లాడ్జీ సెంటర్ నుంచి కంకరగుంట ఆర్వోబీ వైపు.. పాఠశాల బస్సులు, ఇతర భారీ వాహనాలను కంకరగుంట ఫ్లై ఓవర్ మీదుగా గుజ్జనగుండ్ల వైపునకు మళ్లించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యామ్నాయ రహదారులలో ఆక్రమణలు తొలగించడంతోపాటు అడ్డగోలుగా పార్కింగ్ చేయకుండా ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బ్రాడీపేట 14 అడ్డరోడ్డు రైల్వే గేటును తిరిగి తెరిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ సతీష్‌కుమార్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment