జగనన్న కాలనీలో విజిలెన్స్ బృందం పరిశీలన
నాదెండ్ల: గణపవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని జగనన్న కాలనీని విజిలెన్స్ అధికారులు గురువారం సందర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో 1200 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేశారు. అనంతరం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు అందించారు. గ్రామంలో రక్షిత మంచినీటి చెరువు దిగువ భాగాన సర్వే నెంబర్లు 80, 81, 94, 95, 96లలో సుమారు 29.76 సెంట్ల భూమిని కావూరు లింగంగుంట్ల వెళ్ళే రోడ్డులో వీరాంజనేయస్వామి ఆలయం పక్కనే మరో మూడెకరాలు ప్రభుత్వం సేకరించి లబ్ధిదారులకు ప్లాట్లుగా అందించింది. జిల్లా విజిలెన్స్ అధికారి సీహెచ్ శివాజీ, ఏవో ఆదినారాయణ, శ్రీరాంమూర్తిలు కాలనీని సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం భూమిని సేకరించకముందు భూమి ధరలు, సేకరించిన తరువాత ధరలను సమీక్షించారు. కార్యక్రమంలో వీఆర్వోలు ఆదిలక్ష్మి, అంకమ్మరావు, గ్రామ సర్వేయర్లు ప్రసన్నకుమారి, పవన్‌కుమార్, అనిల్, శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాష, సంతోష్, ఉమాదేవి పాల్గొన్నారు.
డీఆర్పీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
సత్తెనపల్లి: ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ, పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకం ద్వారా జిల్లా రిసోర్స్ పర్సన్స్ (డీఆర్పీఎస్) ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పల్నాడు జిల్లా డీఆర్‌డీఏ పీడీ బి.బాలూనాయక్ గురువారం తెలిపారు. ఈ పథకం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్‌గా చిన్న తరహా ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్‌ను ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంపికై న అభ్యర్థులు పీఎంఎఫ్‌ఎంఈ పథక నోడల్ ఏజెన్సీ అయిన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా డీఆర్పీలుగా నియమితులవుతారని, స్థిరమైన నెలవారీ వేతనం ఉండదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలానికి ఒక డీఆర్పీని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారన్నారు. నియమితులైన డీఆర్పీలు తగిన పారిశ్రామికవేత్తలను గుర్తించడం, పీఎంఎఫ్‌ఎంఈ పథకం వివరించడం, సరైన ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ఆలోచనలను సూచించడం, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయడం, బ్యాంకులతో సమన్వయం చేసి రుణాలను సమకూర్చడం, యూనిట్ స్థాపన, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, ఉద్యం యాప్ నందు నమోదు పూర్తి చేయుటలో సహకరించడం వంటి పనులను నిర్వహిస్తారన్నారు. పనితీరు ఆధారంగా ఇన్‌సెంటివ్స్ అందిస్తారని పేర్కొన్నారు. బ్యాంకు రుణం పొందిన తర్వాత రూ.10 వేలు, డీపీఆర్ ప్రకారం యూనిట్ స్థాపన, అధికారికత పూర్తయిన తర్వాత మరో రూ.10 వేలు అందిస్తారన్నారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలన్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉండాలన్నారు. 2024 నవంబర్ 1 నాటికి వయసు 30 ఏళ్లకు మించకూడదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ లేదా నాచ్యురల్ డెవలప్మెంట్ కార్యకలాపాలలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. దరఖాస్తు చేయడానికి ఈనెల 5 చివరి తేదీ అని, ఆసక్తి ఉన్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఈనెల ఐదు లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment