సివిల్ కేసులో పోలీసుల అత్యుత్సాహం
లక్ష్మీపురం: సివిల్ వివాదంలో ఉన్న ఇంటిని ఆక్రమించుకునే యత్నం చేస్తున్న అధికార పార్టీ నాయకుడికి పట్టాభిపురం పోలీసులు అత్యుత్సాహంతో అండగా నిలిచారు. సాయిబాబా రోడ్డు ప్రశాంతి నగర్ 2వ లైన్‌లో డిప్యూటీ మేయర్ వనమా వజ్రబాబు సోదరి వజ్ర కుమారి అద్దెకు ఉంటున్న ఇంటికి సంబంధించి సివిల్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని చెప్పినప్పటికి ఆ ఆదేశాలను ధిక్కరించి మరీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడికి వత్తాసు పలుకుతున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలు వజ్ర కుమారి తెలిపిన వివరాల ప్రకారం.... ‘‘ 2008వ సంవత్సరం నుంచి సాయిబాబా రోడ్డు ప్రశాంతి నగర్ 2వ లైన్‌లోని ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఈ ఇంటికి సంబంధించి సివిల్ వివాదం నడుస్తోంది. ఇదే ఇంట్లో నా భర్త కూడా అనారోగ్య కారణంగా కన్నుమూశారు. నా ఇద్దరు సంతానానికి కూడా ఇదే నివాసంలో వివాహం చేశా. నా తమ్ముడు డైమండ్ బాబు వైఎస్‌ఆర్ సీపీలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం, నగర డిప్యూటీ మేయర్‌గా ఉన్నారని అధికార పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధి అయిన యనమల విజయ్‌కిరణ్ అనే వ్యక్తి బలవంతంగా ఈ ఇంటిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడు. మా ఇంటిపై డిసెంబర్ 22వ తేదీన అనుచరులతో వచ్చి మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా బయటకు గెంటేశాడు. వారి అనుచరులను అదే ఇంట్లో పెట్టి చాలా పెద్ద గొడవకు దిగాడు. ఆ సమయంలో పట్టాభిపురం సీఐ వీరేంద్ర కూడా మా సోదరుడైన డైమండ్ బాబు పట్ల దురుసుగా వ్యవహరించారు. బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించగా, జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవడంతో వదిలిపెట్టారు. పోలీసులు ఆ రోజు కూడా మమ్మల్ని లోపలికి రానివ్వకుండా కిరణ్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. అదే తరహాలో మంగళవారం స్వయంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సై, ఏఎస్సై వచ్చి ఇంట్లో ఉన్న మమ్మల్ని గట్టిగా కేకలు వేసి బయటకు రావాలని బెదిరించారు. ఇదేంటని ప్రశ్నించిన నా కుమారుడు, కోడలు పట్ల దురుసుగా వ్యవహరించారు. కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్న తనను కూడా ఇంట్లో నుంచి బయటకు రావాల్సిందిగా పోలీసులు పేర్కొన్నారు. బయటకు పంపించే యత్నం చేశారు. విజయ్‌కిరణ్ ఈ ఇంటిని ఆక్రమించుకోవాలని అనుచరులతో ఇంటి తలుపులు బద్దలు కొట్టి మమ్మల్ని బయటకు లాగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన పోలీసులు
ఇంటిని ఆక్రమించుకుంటున్న వ్యక్తికి అన్నివిధాలా అండ
దౌర్జన్యంగా ఇంటి ఆక్రమణకు అధికార పార్టీ నేత యత్నం
పోలీసులు జోక్యం చేసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్
Comments
Please login to add a commentAdd a comment