కార్పొరేషన్ అధిక్కారి!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నగరంలో విభజించు, పాలించు తరహాలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలోకి గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడులో కొంత భాగం వస్తుంది. నగరంలో చేపట్టే కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ మూడు ప్రాంతాల ప్రజాప్రతినిధులను, స్థానిక ఎంపీ, మేయర్, డెప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్‌ని భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కార్పొరేషన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే దీనికి భిన్నంగా జరుగుతున్నాయి. కొన్ని కార్యక్రమాలకు కొందరినే పిలుస్తుండటం, మరికొందరిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం జరుగుతోంది. దీనికి ఇటీవల గుంటూరు నగరంలోని పీవీకే మార్కెట్ ఆధునికీకరణ పనులపై జరిగిన సమావేశమే నిదర్శనం. మార్కెట్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చినా అది అందరికీ కీలకమైనది. ఈ సమావేశానికి పశ్చిమ ఎమ్మెల్యే మాధవిని మాత్రమే పిలిచారు. కనీసం మేయర్‌కు గానీ మిగిలిన కార్పొరేటర్లు ఎవరికీ సమాచారం లేదు.
తూర్పు ఎమ్మెల్యేతో గ్యాప్
పీవీకే మార్కెట్ టెండర్ల దశ దాటి పనులు మొదలు పెట్టాలంటే అందులో ఉన్న 374 షాపులను ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించాలి. ఈ మార్కెట్ పూర్తి కావడానికి మూడేళ్ల కాలం పడుతుంది. అంతవరకూ వేరే చోట ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీన్ని బీఆర్ స్టేడియం, బస్టాండ్, వేంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వర్తకులు కోరుతున్నారు. ఈ మూడు ప్రాంతాలు తూర్పు నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. అటువంటప్పుడు ఇద్దరు ప్రజాప్రతినిధులను కూర్చొబెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే పశ్చిమ ఎమ్మెల్యే ఒక్కరినే పిలిచారని కూటమి నేతలు మండిపడుతున్నారు. గత కొద్దికాలంగా మున్సిపల్ కమిషనర్‌కు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌కు మధ్య గ్యాప్ నడుస్తోంది. దీంతో ఆయనను పక్కన పెట్టి కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తుతున్నారు.
కమిషనర్ ద్వంద్వ వైఖరి
పశ్చిమ ఎమ్మెల్యే మాధవికి పెద్దపీట,తూర్పు ఎమ్మెల్యే నసీర్‌పై చిన్నచూపు పీవీకే మార్కెట్ సమావేశానికి అందని ఆహ్వానం సంక్రాంతి సంబరాలకూ సమాచారం లేదు మేయర్‌కు చెప్పకుండానే ఆహ్వాన పత్రం విడుదల కూటమి నేతల నుంచే నిరసన స్వరం
మేయర్‌కు తెలియకుండానే సంబరాలు!
తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల విషయంలోనూ కమిషనర్ ఏకపక్ష ధోరణతో వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సంబరాల గురించి నగర మేయర్‌కు ఒక్కమాట కూడా చెప్పకుండా నిర్వహణకు ముందుకు వెళ్తున్నారు. సంక్రాంతి సంబరాల బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా కూడా పశ్చిమ ఎమ్మెల్యేతోపాటు తెలుగుదేశం కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. తూర్పు ఎమ్మెల్యే హాజరు కాలేదు. ఈ బ్రోచర్‌లో ప్రథమ పౌరుడిగా మేయర్ పేరు వేయాల్సి వస్తుందని అసలు పేర్లు లేకుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటూ బ్రోచర్ వేశారు. ప్రొటోకాల్ పాటించకుండా అధికార యంత్రాంగం కుంటిసాకులు వెతుకుతుండటం, ఏకపక్షంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల కౌన్సిల్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment