అమ్మో ప్రైవేట్ ట్రావెలా..!
ప్రత్తిపాడు: ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ నిలువునా దోచుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో టికెట్‌ల ధరలను ఇష్టారాజ్యంగా రెండు రెట్లు, మూడు రెట్లు పెంచేసి అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారు. ఇదేమని అడిగే వారు కరువవడం, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, నియంత్రిచాల్సిన రవాణాశాఖ అధికారగణం కళ్లు తెరవకపోవడంతో పండుగ వేళ ప్రయాణికుల జేబుకు పెద్ద కన్నం పడక తప్పడం లేదు. ఒక్కో టికెట్‌పై అదనంగా వేల రూపాయలను యాజమాన్యాలు వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. సాధారణంగా అయితే గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ బస్సుకు రూ.450, ఏసీ బస్సుకు రూ.500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.650 నుంచి రూ.750 వరకు ధరలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్‌ఏసీ రూ.500, ఏసీ రూ.550, స్లీపర్ ఏసీ రూ.600 నుంచి రూ.700 వరకు బస్సును బట్టి రూ.వెయ్యి కూడా ఉంటాయి. కానీ సంక్రాంతి నేపథ్యంలో ఈ టికెట్ వెలను ఆయా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు రేటును వసూలు చేస్తున్నాయి. ఆయా ట్రావెల్స్ వారి వారి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి.
సర్కారు చోద్యం
రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి వారు స్వగ్రామాలకు రావడం సహజం. ఒక్కసారిగా ప్రజలు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. అయినా అటు ప్రభుత్వం గానీ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగం గానీ పట్టించుకోవడం లేదు. ప్రజలు, ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నా కిక్కురుమనడం లేదు.
హైదరాబాద్ నుంచి గుంటూరుకు..
బస్సు రకం ప్రస్తుతం సంక్రాంతి ముందు
(రూ.లలో) (రూ.లలో)
నాన్‌ఏసీ 400–500 1,400–1,700
ఏసీ 500–600 1,800–2,900
స్లీపర్ ఏసీ 500–750 1600–3100
గుంటూరు నుంచి హైదరాబాద్‌కు..
ప్రస్తుతం సంక్రాంతి తర్వాత
నాన్‌ఏసీ 350–450 1,200–2,000
ఏసీ 450–700 1,300–2,800
స్లీపర్ ఏసీ 500–700 1,400–3,000
సంక్రాంతి ఎఫెక్ట్
ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెంచేసిన యాజమాన్యాలు ప్రయాణికులపై హై‘ధర’బాదుడు ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోని కూటమి సర్కారు
Comments
Please login to add a commentAdd a comment