వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై దాష్టీకం

Published Thu, Jan 9 2025 1:43 AM | Last Updated on Thu, Jan 9 2025 1:43 AM

-

నర్సరావుపేట: వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలపై అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసుల దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బొల్లాపల్లి మండలం వెంకట రెడ్డిపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన కుటుంబంలోని వారిపై దాడులు చేయడమే కాకుండా మరోవైపు పోలీసులు దాడులు చేసి దారుణంగా కొట్టిన ఘటన వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వాంకుడావవత్‌ బాలు నాయక్‌కు చెందిన ఆవులు తమ చేలో పడ్డాయని అదే గ్రామానికి చెందిన గాలం శ్రీను, పవన్‌ అనే వ్యక్తులు.. బాలునాయక్‌ భార్య వాకిలీబాయి, కుమారుడు దుర్గాప్రసాద్‌ నాయక్‌తో గత నెల 2వ తేదీన ఘర్షణకు దిగారు. అప్పుడు పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. తరువాత టీడీపీ నాయకుల ఒత్తిడితో ఈ నెల 7వ తేదీన బాలు నాయక్‌ కుమారుడైన దుర్గాప్రసాద్‌ నాయక్‌ను పొలంలో పని చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లాపల్లి స్టేషనుకు తరలించారు. అదే రోజు పోలీసులు తమదైన శైలిలో దుర్గాప్రసాద్‌ శరీరంపై వాతలు తేలేటట్లు కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. కంగారుపడిన పోలీసులు వెంటనే బొల్లాపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలకు దుర్గాప్రసాద్‌ను తరలించారు. అక్కడ లాభం లేదని, మెరుగైన చికిత్స కోసం వినుకొండ తరలించాలని వైద్యులు సూచించారు. వెంటనే ప్రైవేటు అంబులెన్సులో వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి బాధితుడిని మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.

ఎస్సై బాలకృష్ణ అత్యుత్సాహం

బొల్లాపల్లి ఎస్సై బాలకృష్ణ వ్యవహారశైలిపై మొదటి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెంకటరెడ్డిపురం గ్రామం కేసులో కూడా దుర్గాప్రసాద్‌ నాయక్‌ను తీవ్రంగా కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిగ్రీ చదువుతున్న దుర్గాప్రసాద్‌ నాయక్‌ భవితవ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును తప్పుపడుతూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. దీనిపై దుర్గాప్రసాద్‌ బాబాయి కాళోజి నాయక్‌ మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని’’ తెలిపారు.

డిగ్రీ చదువుతున్న విద్యార్థిని చితకబాదిన పోలీసులు బొల్లాపల్లి ఎస్సై తీరుపై తీవ్ర ఆరోపణలు కొట్టాక బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వైనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement